Share News

గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:39 PM

గిరిజనుల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు.

గిరిజనుల సమగ్రాభివృద్ధికి కృషి
పాడేరు పట్టణంలో పార్టీ శ్రేణులతో ర్యాలీ చేపడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

జిల్లాలో బీజేపీని బలోపేతం చేయాలని సూచన

పాడేరులో పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ

పాడేరు, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): గిరిజనుల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ దిశగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. స్థానిక వీఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వివిధ కేంద్ర పథకాల ద్వారా ప్రతి గిరిజనుడి ఇంటిని ప్రధాని మోదీ పరోక్షంగా సందర్శిస్తున్నారన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా జల్‌జీవన్‌ మిషన్‌లో ఇంటింటికీ తాగునీరు, పీఎంజీఎస్‌వైలో ప్రతి మారుమూల ప్రాంతానికి తారు రోడ్లు, జాతీయ ఉపాధి హామీ పథకంలో భవనాలు, రోడ్లు, వ్యవసాయ, ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. పార్టీ క్యాడర్‌ సైతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని బలోపేతం చేయాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయనగరం జిల్లాను అనుసంధానం చేస్తూ అల్లూరి జిల్లా మీదుగా జాతీయ రహదారి నిర్మాణం, పాడేరులో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో ఈ ప్రాంతాభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. విద్యాభివృద్ధిలో భాగంగా జిల్లాలో 17 ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రపంచంతో పోటీ పడేలా నాణ్యమైన విద్యను గిరిజన విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. గిరిజన ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడంతో పాటు గిట్టుబాటు కల్పించేందుకు పీఎం వన్‌దన్‌ వికాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, పీఎం జన్‌మన్‌లో భాగంగా ఆదిమజాతి గిరిజనులకు ఇళ్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులతో పాటు నిర్వాసితులకు పునరావాసం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. మంప, రాజేంద్రపాలెంలోని అల్లూరి స్మారక ప్రదేశాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అంతకు ముందు ఆయన స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, స్థానిక మోదకొండమ్మను దర్శించుకున్నారు. అనంతరం పాడేరు పట్టణంలో పార్టీ శ్రేణులతో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సంఘటన్‌ మంత్రి మధుకర్‌జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తపన చౌదరి, దయాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు పైడి వేణుగోపాల్‌, రెడ్డి పావని, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు కురుసా ఉమామహేశ్వరరావు, ట్రైకార్‌ డైరెక్టర్‌ కూడా కృష్ణారావు, జిల్లా అధ్యక్షురాలు మఠం శాంతికుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నందోలి ఉమామహేశ్వరరావు, డొంబునాయుడు, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సల్లా రామకృష్ణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెనుమాక రవికుమార్‌, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:39 PM