సమర్థంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:50 AM
గిరిజన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని దిశ కమిటీ అధ్యక్షురాలు, అరకులోయ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ జి.తనూజరాణి అన్నారు.
దిశ కమిటీఅధ్యక్షురాలు, అరకులోయ ఎంపీ డాక్టర్ జి.తనూజరాణి సూచన
పాడేరు, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని దిశ కమిటీ అధ్యక్షురాలు, అరకులోయ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ జి.తనూజరాణి అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గిరిజన ప్రాంతంలో పని చేయడం అధికారులు అదృష్టంగా భావించి, అంకితభావంతో పని చేయాలన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలన్నారు. గత మూడు నెలల్లో జిల్లా అభివృద్ధికి సంబంధించిన వివిధ శాఖల ప్రగతిని ఆమె సమీక్షించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. గిరిజన కాఫీ రైతులకు అందిస్తున్న ఉపకరణాల గురించి అడిగి, డ్రోన్లపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని, రూ.10 లక్షల విలువైన డ్రోన్లను రూ.8 లక్షల రాయితీపై ప్రభుత్వం అందిస్తుందనే విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు. గిరిజన ప్రాంతానికి చేరువగా కాఫీ పల్పింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతీయ రహదారి విస్తరణలో ధ్వంసమైన చెక్‌డ్యామ్‌లు, తాగునీటి పైపులైన్లు మరమ్మతులు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని నేషనల్ హైవే అధికారులను ఆమె అడిగి తెలుసుకున్నారు. త్వరగా ఆయా మరమ్మతులు చేపట్టాలన్నారు.
అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి కృషి
ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ సూచించారు. జిల్లాలో 373 పాఠశాలలకు భవనాలను నిర్మించేందుకు రూ.45 కోట్లు, చింతపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి రూ.7 కోట్ల మంజూరయ్యాయని తెలిపారు. అలాగే వ్యవసాయ ఉపకరణాలు లబ్ధిదారులకు పంపిణీ చేసే క్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో చర్చించి అవసరమైన ఉపకరణాలు పంపిణీ చేయాలన్నారు. జాతీయ రహదారిపై పశువుల సంచారంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులకు ఉపయోగపడే వ్యవసాయ ఉపకరణాలు పంపిణీ చేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ 40 శాతం నిధులు మంజూరు చేస్తున్నాయన్నారు. ఆయా నిధులు సక్రమంగా ఖర్చు చేసి అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మహిళా సంఘాలతో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. వాటికి బ్యాంకు లింకేజీ అందించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు మండల సర్వసభ్య సమావేశాలకు హాజరు కావడం లేదని పలువురు ఎంపీపీలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. అటువంటి అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపడతామని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేయాలన్నారు. పవర్ టిల్లర్లు, పవర్ వీడర్ల వంటి వ్యవసాయ ఉపకరణాలను రైతులకు వ్యక్తిగతంగా అందించాలన్నారు. ముంచంగిపుట్టు ఏకలవ్య మోడల్ స్కూల్‌లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్ గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్ పటేల్, పాడేరు, అరకులోయ ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్యలింగం, జిల్లా పరిషత్ సీఈవో పి.నారాయణమూర్తి, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, డ్వామా పీడీ విద్యాసాగర్, డీఎంహెచ్‌వో టి.విశ్వేశ్వరనాయుడు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నందు, సీపీవో పి.ప్రసాద్, డీఈవో బ్రహ్మాజీరావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, చింతపల్లి ఎంపీపీ కె.అనూషా, హుకుంపేట ఎంపీపీ కె.రాజబాబు, రంపచోడవరం, రాజవొమ్మంగి ఎంపీసీసీలు శ్రీదేవి, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.