Share News

కొత్త డీఎస్సీకి విద్యా శాఖ కసరత్తు

ABN , Publish Date - Nov 04 , 2025 | 01:18 AM

వచ్చే ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు సిద్ధం చేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది.

కొత్త డీఎస్సీకి విద్యా శాఖ కసరత్తు

ఉమ్మడి జిల్లాల వారీగా సమాచారం

పంపాల్సిందిగా పాఠశాల విద్యా శాఖ ఆదేశం

వచ్చే ఏడాది మే నెలాఖరు వరకూ ఏర్పడనున్న ఖాళీల వివరాలు సేకరణలో అధికారులు

పదవీ విరమణలు, పదోన్నతులతో భారీగానే ఖాళీలు?

సుమారు 500 నుంచి 600 వరకు ఉండవచ్చునని ఉపాధ్యాయ సంఘాల అంచనా

విశాఖపట్నం, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి):

వచ్చే ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి నారా లోకేశ్‌ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు సిద్ధం చేయాలని పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. వచ్చే ఏడాది మే నెలాఖరు వరకూ ఏర్పడబోయే ఖాళీలను పరిగణనలోకి తీసుకుని కేటగిరీ వారీగా నివేదిక సిద్ధం చేయాలన్న ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ వివరాల సేకరణలో నిమగ్నమైంది.

ఈ ఏడాది నిర్వహించిన డీఎస్సీలో అన్ని కేటగిరీలు కలిపి ఉమ్మడి జిల్లాలో 1,134 మందిని ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. వీరికి గత నెల తొలివారంలో నియామక పత్రాలు అందజేశారు. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 400 ఖాళీలు, ప్రభుత్వ, జడ్పీ పరిధిలోని పాఠశాలల్లో సుమారు 150 ఖాళీలను తాజా డీఎస్సీ ద్వారా భర్తీచేశారు. ఇంకా ఏజెన్సీతోపాటు మైదానంలో ఎస్జీటీ, స్కూలు అసిస్టెంట్‌ కేటగిరీల్లో ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ప్రతినెలా పలువురు టీచర్లు పదవీ విరమణ చేస్తున్నారు. 1989 నుంచి 1998 మధ్య డీఎస్సీ ద్వారా నియమితులైన పలువురు టీచర్లు ఈ ఏడాది నవంబరు, డిసెంబరు, వచ్చే ఏడాది మే నెలాఖరులోగా పదవీ విరమణ చేయనున్నారు. ఇంకా ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పదవీ విరమణ చేయడంతో ఆయా పోస్టులకు స్కూలు అసిస్టెంట్లతో భర్తీచేయనున్నారు. దీంతో స్కూలు అసిస్టెంట్‌ కేటగిరీలో ఖాళీలు ఏర్పడనున్నాయి.

ఇదిలావుండగా ఉమ్మడి జిల్లాలో కొందరు టీచర్లు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వచ్చే ఏడాది మే నెలాఖరు నాటికి ఏర్పడబోయే ఖాళీల వివరాలను మండల విద్యాశాఖాధికారుల నుంచి జిల్లా విద్యా శాఖ సేకరిస్తోంది. వచ్చే ఏడాది మే నెలాఖరుకల్లా సుమారు 500 నుంచి 600 వరకు ఖాళీలు ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంచనా వేస్తున్నాయి. మండలాల నుంచి పూర్తి వివరాలు వచ్చిన తరువాత గానీ ఖాళీలపై స్పష్టత రాదని అంటున్నారు. పాఠశాల విద్యా శాఖ ఆదేశాల మేరకు వచ్చే ఏడాది మే నెలాఖరు వరకూ ఏర్పడబోయే ఖాళీల వివరాలు నివేదిక సిద్ధం చేస్తున్నామని విశాఖ డీఈవో నిమ్మక ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 04 , 2025 | 01:18 AM