ప్రకృతి వ్యవసాయంతో ఆర్థికాభివృద్ధి
ABN , Publish Date - Oct 05 , 2025 | 10:23 PM
ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని రైతు సాధికారిత సంస్థ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి.విజయకుమార్ అన్నారు.
రైతు సాధికారిత సంస్థ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి.విజయకుమార్
పాడేరురూరల్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని రైతు సాధికారిత సంస్థ చైర్మన్, ప్రభుత్వ సలహాదారు టి.విజయకుమార్ అన్నారు. మండలంలోని బరిసింగి గ్రామంలో ఆదివారం ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం గ్రామంలో రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. గిరిజన రైతులు.. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో కాఫీ, పసుపు, కూరగాయల పంటల సాగు గురించి, మహిళా సంఘాల సభ్యులు స్థానికంగా తయారు చేసే బయో ఇన్‌పుట్స్(జీవామృతం, ఘన జీవామృతం, వేప కషాయం మొదలైనవి)తయారు చేసి వాటి గురించి వివరించారు. అలాగే రిలే క్రాపింగ్ పద్ధతిలో పంటలను సాగు చేయడం ద్వారా రైతులు నిరంతరం ఆదాయం పొందుతున్న విధానాన్ని కూడా చూపించారు. అధికారులు గ్రామంలోని లీడ్ ఫార్మర్లతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సారవంతం పెరిగే తీరును, పురుగుల సమస్య తగ్గే విధానాన్ని, రైతులకు లభిస్తున్న ఆర్థిక లాభాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో పాల్గొన్న అధికారులు రైతులను ప్రోత్సహిస్తూ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను మరింత విస్తరించడానికి సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికారత సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ టి.బాబూరావునాయుడు, కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్, ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, రైతు సాధికారత సంస్థ జిల్లా అదనపు మేనేజర్ ఎల్.భాస్కరరావు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.