జీవీఎంసీలో ఈట్ రైట్ క్యాంపైన్
ABN , Publish Date - Aug 21 , 2025 | 01:27 AM
నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ దిశగా జీవీఎంసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘ఈట్ రైట్ క్యాంపైన్’ పేరుతో ఎస్‌హెచ్‌ఈ (శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్) టీమ్స్‌ను ఏర్పాటుచేసింది. ఈ టీమ్‌లు అన్ని జోన్లలోని హోటళ్లు, ఇతర ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, పరిశుభ్రత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు,
వీధి విక్రయ దుకాణాల్లో
శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్స్
విస్తృత తనిఖీలు
ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత పాటించకుంటే కఠిన చర్యలు
కల్తీకి పాల్పడినా, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించినా సీజ్ చేస్తాం
కమిషనర్ కేతన్‌గార్గ్ హెచ్చరిక
వెంకోజీపాలెం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):
నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణ దిశగా జీవీఎంసీ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘ఈట్ రైట్ క్యాంపైన్’ పేరుతో ఎస్‌హెచ్‌ఈ (శానిటేషన్ అండ్ హెల్త్ ఎన్‌ఫోర్స్‌మెంట్) టీమ్స్‌ను ఏర్పాటుచేసింది. ఈ టీమ్‌లు అన్ని జోన్లలోని హోటళ్లు, ఇతర ఆహార పదార్థాలు విక్రయించే దుకాణాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత, పరిశుభ్రత పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు.
నగరంలోని ప్రతి జోన్ పరిధిలో రెండు ఎస్‌హెచ్‌ఈ టీమ్స్ చొప్పున మొత్తం 16 టీమ్‌లను ఈట్‌రైట్ క్యాంపైన్ కోసం ఏర్పాటు చేశామని జీవీఎంసీ కమిషనర్ వివరించారు. ఈ టీమ్‌లు హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, వీధి ఆహార విక్రయ కేంద్రాల్లో పదార్థాల నాణ్యత, పరిశుభ్రతను పరిశీలిస్తాయని, నిబంధనలు పాటించని, నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తాయన్నారు.
ఇప్పటివరకూ 8 జోన్లలో 76 చోట్ల ఆహార తనిఖీలు చేపట్టాయన్నారు. 71 హోటళ్లు, రెస్టారెంట్లకు, ఆహార విక్రయ కేంద్రాలకు నోటీసులు ఇచ్చి రూ.68,600 అపరాధ రుసుము వసూలు చేశాయన్నారు. ఒకటో జోన్‌లో 8 చోట్ల తనిఖీలు చేపట్టి మూడింటి నుంచి రూ.21 వేలు, రెండో జోన్‌లో 11 చోట్ల తనిఖీలు నిర్వహించి 10 దుకాణాల నుంచి రూ.10 వేలు, మూడో జోన్‌లో పదకొండుచోట్ల తనిఖీలు చేయగా ఐదుగురి నుంచి రూ.21 వేలు, 4వ జోన్‌లో పదిచోట్ల తనిఖీలు చేపట్టి రూ.11 వేలు, ఐదో జోన్‌లో పదకొండుచోట్ల తనిఖీలు చేసి ముగ్గురి నుంచి రూ.4 వేలు, 6వ జోన్‌లో ఏడు చోట్ల తనిఖీల్లో భాగంగా ఆరుగురి నుంచి రూ.7,800, ఏడో జోన్‌లో ఆరు చోట్ల జరిగిన తనిఖీల్లో ముగ్గురి నుంచి రూ.1,300, 8వ జోన్‌లో పన్నెండుచోట్ల చేపట్టిన తనిఖీల్లో పది దుకాణాల నుంచి రూ.11 వేలు అపరాధ రుసుం కింద వసూలు చేసినట్టు చెప్పారు. ఈ టీమ్‌లు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయన్నారు. ప్రజల ఆహార భద్రతతో పాటు, ప్లాస్టిక్ నియంత్రణ దిశగా వ్యాపారుల్లో మార్పు తీసుకురావడమే వీటి లక్ష్యమన్నారు. తద్వారా ప్లాస్టిక్ రహిత, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ కృషిచేస్తుందని కమిషనర్ పేర్కొన్నారు. నగరంలో ఆహార విక్రయదారులు పరిశుభ్రతతో పాటు నాణ్యతపై దృష్టిసారించాలన్నారు. ఆహార ఉత్పత్తుల్లో కల్తీకి పాల్పడినా, నిషేధిత ప్లాస్టిక్ వినియోగించినా హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు ఇతర ఆహార విక్రయ కేంద్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.