Share News

భూకంపం

ABN , Publish Date - Nov 05 , 2025 | 01:16 AM

జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటల సమయంలో ఒక నిమిషంపాటు భూమి కంపించింది.

భూకంపం

నగరంలో తెల్లవారుజామున 4.19 గంటల సమయంలో కంపించిన భూమి

రిక్టర్‌ స్కేల్‌పై 4.0గా నమోదు

అనేక చోట్ల పెద్ద శబ్దాలు

విశాఖ సేఫ్‌ జోన్‌లో ఉందన్న భూ భౌతిక శాస్త్రవేత్తలు

ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటన

విశాఖపట్నం, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున 4.19 గంటల సమయంలో ఒక నిమిషంపాటు భూమి కంపించింది. సుమారు పది కిలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.0గా నమోదైనట్టు నేషనల్‌ సెంటర్‌ సెస్మాలజీ వెల్లడించింది. కేంద్ర స్థానం తొట్లకొండ ప్రాంతంగా భూభౌతిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రధానంగా నగర పరిధిలోని అక్కయ్యపాలెం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఎంవీపీ కాలనీ, ఆరిలోవ, భీమిలి, మధురవాడ తదితర ప్రాంతాల్లో భూకంప తీవ్రత కనిపించింది. ఆ సమయంలో పెద్ద శబ్దం వినిపించింది. అప్పటికే నిద్రలేచినవారు ఈ శబ్దాలకు ఆందోళన చెందగా, నిద్రలో ఉన్న వారికి మాత్రం భూమి కంపించిన విషయం తెలియలేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూమి కంపించడంతోపాటు శబ్దాలు వచ్చినట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు.

విశాఖ సేఫ్‌ జోన్‌

విశాఖ జిల్లాలో అనేకమార్లు భూకంపం వచ్చింది. అయితే, తీవ్రత ఎప్పుడూ స్వల్పంగానే ఉంటుందని, దానికి కారణం విశాఖ భూకంప తీవ్రత తక్కువగా ఉండే జోన్‌లో ఉండడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని భూంకపాలు సంభవించే ప్రాంతాలకు సంబంధించిన వివరాలతో ఇండియన్‌ సెస్మ లాజికల్‌ అబ్జర్వేటర్‌ ఒక మ్యాప్‌ను రూపొం దించింది. ఏ ఏరియాల్లో భూకంపం ఎక్కువగా వస్తుందన్న దాన్ని ఇందులో పేర్కొంది. దీని ప్రకారం విశాఖ రీజియన్‌లో భూకంపాలు వస్తాయి. కానీ, తీవ్రత సాధారణ స్థాయిలో ఉంటుంది. విశాఖ భూకంపాలకు సంబంధించి సేఫ్‌ జోన్‌లోనే ఉందని నిపుణులు పేర్కొంటు న్నారు. భూకంప తీవ్రత 4.5 (రిక్టర్‌ స్కేల్‌పై) వరకూ ఇబ్బంది ఉండదని, అంతకు మించితే కొంత ప్రమాదం ఉంటుందని ఏయూ భూ భౌతిక శాస్త్ర విభాగ ప్రొఫెసర్‌ ప్రొఫెసర్‌ పెంటకోట త్రినాథరావు వెల్లడించారు. 4.5 దాటితే భవనాలు ఊగడం, పగుళ్లు రావడం వంటివి జరుగుతాయన్నారు.

శబ్దాలకు కారణం అదే.?

సాధారణంగా భూకంపం సంభవించినప్పుడు పెద్దగా శబ్దాలు రావు. కానీ, కొన్ని సందర్భాల్లో భూకంప తరంగాలు ధ్వని తరంగాలు రూపంలోకి మారి శబ్దాలకు కారణమవుతాయి. మంగళవారం ఉదయం విశాఖ రీజియన్‌లో సంభవించిన భూకంపంతోపాటు శబ్దాలు రావ డానికి ఇదే కారణమై ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖ రీజియన్‌ భూకంపా లకు సంబంధించి డేంజర్‌ జోన్‌లో లేదని, కాబట్టి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏయూ భూ భౌతిక శాస్త్ర విభాగ ప్రొఫెసర్‌ ప్రొఫెసర్‌ పెంటకోట త్రినాథరావు వెల్లడించారు.

పెద్ద శబ్దం రావడంతో ఆందోళన చెందాం

ఉరిటి రవికాంత్‌, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

మేము నేరేళ్లవలస కాలనీలో ఉంటున్నాం. తెల్లవారుజామున నాలుగు గంటలకు బాబు (3) నిద్రలేచాడు. మళ్లీ నిద్రపుచ్చుతున్నాం. సుమారు 4.19 గంటలకు ఇంట్లో కుడి భాగం నుంచి ఎడమ భాగానికి ఒక్కసారిగా డ్రిల్లింగ్‌ మిషన్‌ వర్క్‌ చేస్తున్నట్టు పెద్ద శబ్దం రావడంతో ఆందోళన చెందాము. ఏదో జరుగుతుందని బయటకు వచ్చాం. మాలాగే వీధిలో నాలుగైదు ఇళ్లలో నుంచి ప్రజలు బయటకు వచ్చారు. దీంతో భయపడి కారులో అలా, సముద్ర తీరానికి వెళ్లి కొద్దిసేపు గడిపి తిరిగి ఇంటికి చేరాం.

Updated Date - Nov 05 , 2025 | 01:16 AM