సంపాదన సాఫల్య కేంద్రాలు!
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:23 AM
సంతాన సాఫల్య కేంద్రాలు అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రాలుగా మారి సంపాదన సాఫల్య కేంద్రాలుగా మారు తున్నాయి.
దగా చేస్తున్న కొన్ని కేంద్రాల నిర్వాహకులు
అడ్డగోలు వ్యవహారాలకు నిలయంగా మారుతున్న ఫెర్టిలిటీ సెంటర్లు
సృష్టి వ్యవహారం వెలుగులోకి రావడంతో చర్చ
గతంలోనూ పలు కేంద్రాలపై ఆరోపణలు
ఆరోగ్యశాఖ పర్యవేక్షణ లేకపోవడమే కారణం
జిల్లాలో 50 ఫెర్టిలిటీ సెంటర్లు
తొమ్మిది కేంద్రాలకు సరోగసీ చేసే అవకాశం
విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):
సంతాన సాఫల్య కేంద్రాలు అడ్డగోలు వ్యవహారాలకు కేంద్రాలుగా మారి సంపాదన సాఫల్య కేంద్రాలుగా మారు తున్నాయి. కొన్నాళ్లుగా జిల్లాలో ఫెర్టిలిటీ సెంటర్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. ఉత్తరాంధ్రతోపాటు అనేక జిల్లాలకు చెందిన వారు ఈ కేంద్రాలకు వచ్చి వైద్య సేవల ను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలు లేని దంపతులను లక్ష్యంగా చేసుకుని అనేకసెంటర్లు అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన తరువాత మిగిలిన కేంద్రా ల్లో వ్యవహారాలపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.
హైదరాబాద్‌లోని సృష్టి సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకులు పిల్లలు లేని జంటకు మరొకరి స్పెర్మ్ ద్వారా పిల్లలు పుట్టించారు. ఆ బిడ్డకు అనారోగ్య సమస్యలు రావడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరా బాద్‌లోని కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేయగా, అప్పటికే భారీగా నిల్వచేసిన స్పెర్మ్ లభించినట్టు తెలిసిం ది. ఈ క్రమంలోనే విశాఖ, విజయవాడలోనూ తనిఖీలు చేపట్టారు. నగరంలోని జిల్లా పరిషత్ జంక్షన్ సమీపంలో సృష్టి సంతాన సాఫల్య కేంద్రం ఉంది ఈ సెంటర్ ఏర్పాటుకు 2018లో అనుమతి తీసుకున్న నిర్వాహకులు 2023 నుంచి రెన్యువల్ చేసుకోలేదు. ఇక్కడ కొన్నాళ్లుపాటు కార్యకలాపాలు కూడా నిర్వహించలేదు. అయితే, సృష్టి పేరుతో ఇక్కడ రహస్యంగా వ్యవహారాలు సాగిస్తున్నట్టు పోలీసు తనిఖీల్లో తేలింది. హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసిన మహిళను ప్రసవం నిమిత్తం ఇక్కడ కొన్నాళ్లపాటు ఉంచి, ఆ తరువాత అక్కడికి తరలించినట్టు తెలుస్తోంది. తాజా దాడుల్లో స్పెర్మ్ నిల్వలతోపాటు పలువురు మహిళల రిపోర్ట్‌లు, ఇప్పటికే చికిత్స అందిస్తూ గర్భం దాల్చిన వారి వివరాలతో కూడిన ఫైల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
గుట్టుగా వ్యవహారాలు..
సంతాన సాఫల్య కేంద్రాల పేరుతో పెద్దఎత్తున వ్యాపా రం సాగుతోంది. ఇందుకోసం ఒక్కో కేంద్రం నిర్వాహకులు ఏజెంట్లను నియమించుకుంటున్నారు. సంతానం లేని జం టలను తీసుకురావడం వారి బాధ్యత. ఇందుకోసం వారికి భారీ మొత్తంలో చెల్లిస్తుంటారు. జిల్లాలో ప్రస్తుతం 50 సంతాన సాఫల్య కేంద్రాలున్నాయి. వీటిలో తొమ్మిది కేంద్రాలకు సరోగసీ నిర్వహించేందుకు అనుమతి ఉంది. అయితే, ఈ కేంద్రాల పేరుతో కొన్నిచోట్ల అడ్డగోలు వ్యవ హారాలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఒకసారి సంతాన సాఫల్య కేంద్రానికి వెళితే జేబులు ఖాళీ అవుతాయని చెబుతారు. పరీక్షల పేరుతో ప్రారంభంలోనే సుమారు రూ.50 వేల వరకు వసూలు చేస్తారని, ఐవీఎఫ్, ఇతర విధానాలకు సిద్ధపడితే కనీసం రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సిందేనని చెబుతున్నారు. అది కూడా వంద శాతం సక్సెస్ రేటు ఉండదని, ఫెయిల్ అయితే మరోసారి ప్రయత్నించాల్సిందేనంటున్నారు. దీనికి మళ్లీ డబ్బులు చెల్లించాల్సిందేనని వాపోతున్నారు. చికిత్స జరిగినంత కాలం ప్రక్రియకు సంబంధించిన రిపోర్టులు, ఇతర వివరాలను బయటకు ఇవ్వరు. కొంతకాలం తరువాత సద రు మహిళ కూడా అదే కేంద్రంలో ఉండాల్సి ఉంటుందంటున్నారు.
నిరుపేదలే లక్ష్యం..
కొన్ని సంతాన సాఫల్య కేంద్రాల నిర్వాహకులు వీర్య కణాల దానం పేరుతో పెద్దఎత్తున వ్యాపారం సాగిస్తున్న ట్టు చెబుతున్నారు. తాజాగా సృష్టి కేసు విచారిస్తున్న పోలీసులు దిమ్మతిరిగే విషయాలను గుర్తించారు. అనేకమంది నుంచి సేకరించిన స్పెర్మ్‌ను చూసి అవాక్కయ్యారు. అనేక ఫెర్టిలిటీ సెంటర్ల నిర్వాహకులు ఇదే తరహాలో భారీగా స్పెర్మ్ కలెక్ట్ చేస్తున్నట్టు చెబుతున్నారు. నగరంలోని చాలా కేంద్రాల్లో ఇది యథేచ్ఛగా సాగుతోందంటున్నారు. స్పెర్మ్ దానం చేసేందుకు వచ్చే యువతకు భారీ మొత్తంలో చెల్లిస్తుంటారు. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న యువతను ఏజెంట్లు బుక్ చేసుకుంటారు. ఈ విషయాన్ని బయటకు రానీయకుండా జాగ్రత్త పడుతుంటారు. అయితే, ఇలా సేకరించిన స్పెర్మ్‌ను కొన్నిసార్లు సంతానం కోసం వచ్చే జంటలకు తెలియకుండా, వారి అనుమతి లేకుండా గర్భ ధారణ కోసం వినియోగిస్తుంటారనే ఆరోపణలున్నాయి. ఇదే ఇప్పుడు సృష్టి సెంటర్ కేసుకు కారణమైంది. ఇటు వంటి వ్యవహారాలే నగరంలో అనేక చోట్ల జరుగుతున్నట్టు చెబుతున్నారు. కొన్నిచోట్ల అనధికారికంగా సరోగసీ చేస్తు న్నారన్న విమర్శలున్నాయి. ఈ ప్రక్రియలో కొంతమంది అమాయక, ఆర్థిక అవసరాలు ఉన్న మహిళలను బలి పశువులు చేస్తున్నారని చెబుతున్నారు. ఆర్థిక అవసరాల కోసం పలువురు మహిళలు అద్దెకు గర్భాలు ఇస్తున్నారని, ఈ క్రమంలో కొంతమంది ప్రాణాలను కోల్పోతుంటే, ఇం కొందరు శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటున్నారు. ఈ తరహా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన కేంద్రాలపై గతంలోనూ ఆరోపణ లు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. తాజాగా సృష్టి ఉదంతం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆరోగ్యశా ఖ అధికారులు సంతాన సాఫల్య కేంద్రాలను తనిఖీ చేయాలంటున్నారు. ఈ వ్యవహారాలపై ఇప్పటికే దృష్టి సారించామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పి.జగదీశ్వరరావు పేర్కొన్నారు. ఫెర్టిలిటీ సెంటర్లు తప్పని సరిగా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని, లేకపోతే కఠిన చర్య లు తీసుకుంటామన్నారు. తాజా వ్యవహారం నేపథ్యంలో ఫెర్టిలిటీ సెంటర్లలో తనిఖీలు చేస్తామన్నారు.