Share News

రౌడీషీటర్లపై డేగ కన్ను

ABN , Publish Date - Aug 26 , 2025 | 01:25 AM

విశాఖపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో రౌడీషీటర్లపై పోలీసులు నిఘాను పటిష్ఠం చేశారు. ఎప్పటిలాగే వారి కదలికలపై కన్ను వేసి ఉంచడంతోపాటు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక సోదాలు చేపట్టాలని సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు.

రౌడీషీటర్లపై డేగ కన్ను

క్రియాశీలకంగా ఉన్నవారి ఇళ్లలో ఆకస్మిక సోదాలు

వారి ప్రతి కదలికలపై ప్రత్యేక నిఘా

వినాయక చవితి నేపథ్యంలో అప్రమత్తమైన సీపీ

నగరంలో గొడవలు, కొట్లాటలు లేకుండా ముందస్తు చర్యలు

విశాఖపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

నగరంలో రౌడీషీటర్లపై పోలీసులు నిఘాను పటిష్ఠం చేశారు. ఎప్పటిలాగే వారి కదలికలపై కన్ను వేసి ఉంచడంతోపాటు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న రౌడీషీటర్ల ఇళ్లలో ఆకస్మిక సోదాలు చేపట్టాలని సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో నగరంలో అల్లర్లు, వివాదాలకు ఆస్కారం లేకుండా ఆయన ముందస్తు చర్యలకు ఉపక్రమించారు.

నగర పరిధిలో సుమారు 650 మంది రౌడీషీటర్లు ఉన్నారు. వీరిలో సగం మంది క్రియాశీలకంగా ఉన్నట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. భూ వివాదాలు, సివిల్‌ సెటిల్‌మెంట్లలో తరచూ తలదూర్చుతున్నారు. కొన్నాళ్ల కిందట ఈస్ట్‌పాయింట్‌కాలనీలోని శాంతి ఆశ్రమం భూ వివాదంలో రెండు వర్గాలకు చెందినవారు రౌడీషీటర్లను ఆశ్రయించడంతో వివాదాస్పద స్థలంలో పట్టపగలే రాళ్ల దాడి చేసుకుని, కొట్టుకున్నారు. దీనిపై ఎంవీపీ పోలీసులు కేసు నమోదుచేసి ఇరువర్గాల్లోని రౌడీషీటర్లలో కొందరిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు. అలాగే హార్బర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోల్‌ హ్యాండ్లింగ్‌ కంపెనీకి చెందిన బొగ్గును దొంగచాటుగా తరలించారనే ఆరోపణపై ఒక డ్రైవర్‌ను కంపెనీ ప్రతినిధులు నిర్బంధించారు. ఒక రౌడీషీటర్‌తో అతడిని తీవ్రంగా కొట్టించడంతో ఆస్పత్రికి తరలించేలోగా ప్రాణాలు కోల్పోయాడు.

ముందస్తు చర్యలు

గత ఏడాది వినాయక నిమజ్జనం ఊరేగింపు సమయంలో సీతమ్మధారలో రెండు వర్గాలకు చెందిన రౌడీషీటర్లు కొట్లాటకు దిగడంతో ఓ రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా నగరంలో అల్లర్లు, కొట్లాటలు జరిగే అవకాశాలున్నట్టు భావించిన సీపీ అప్రమత్తమయ్యారు. క్రియాశీలకంగా ఉన్న రౌడీషీటర్లను గుర్తించి, వారిపై నిఘా పెంచాలని సంబంధిత పోలీస్‌ స్టేషన్ల అధికారులకు సూచించారు. ప్రతి స్టేషన్‌ పరిధిలోనూ యాక్టివ్‌గా ఉండే రౌడీషీటర్ల జాబితా సిద్ధం చేసుకుని, వారి ఇళ్లలో ఆకస్మిక సోదాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు ఇటీవల భీమిలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రౌడీషీటర్ల ఇళ్లలో పోలీసులు సోదాలు చేయగా ఒక రౌడీషీటర్‌ ఇంట్లో రెండు కత్తులు లభ్యమయ్యాయి. దీంతో అతడిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వినాయక చవితి ఉత్సవాలు ముగిసేవరకు రౌడీషీటర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, దీనివల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తదని సీపీ ఆదేశించినట్టు తెలిసింది. పోలీసుల తాజా వ్యూహంతో నగరంలో యాక్టివ్‌గా ఉండే రౌడీషీటర్లలో గుబులు మొదలైంది.

Updated Date - Aug 26 , 2025 | 01:25 AM