Share News

హోటల్‌ ఫుడ్‌లో రంగులు, రసాయనాలు

ABN , Publish Date - Sep 16 , 2025 | 01:05 AM

నగర పరిధిలోని అనేక హోటళ్లు ఆహార పదార్థాల తయారీలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు, రసాయనాలను వినియోగిస్తున్నాయి.

హోటల్‌ ఫుడ్‌లో రంగులు, రసాయనాలు

  • పరీక్షల్లో నిర్ధారణ

  • గత నెలలో ఆహార భద్రత, ప్రమాణాల శాఖ తనిఖీలు

  • 81 నమూనాల సేకరించి పరీక్షలకు పంపింన అధికారులు

  • పదిహేను నమూనాల్లో హానికర రంగులు...

  • మరో 14 నమూనాల్లో నాణ్యత తక్కువ...

  • కేసులు నమోదు చేయనున్నట్టు అధికారులు

విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

నగర పరిధిలోని అనేక హోటళ్లు ఆహార పదార్థాల తయారీలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే రంగులు, రసాయనాలను వినియోగిస్తున్నాయి. ఈ విషయం పరీక్షల్లోనే నిర్ధారణ అయ్యింది. గత నెల ఆహార భద్రత, ప్రమాణాల శాఖ, తూనికలు కొలతలు శాఖ అధికారులు సంయుక్తంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్‌ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాణ్యత లేని, రోజుల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి వాటి నమూనాలను (మొత్తం 81) సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌ ల్యాబ్‌కు పంపించారు. ఆ పరీక్షల ఫలితాలు అధికారులకు అందాయి. మొత్తం 81 నమూనాల్లో ఇరవై తొమ్మిదింటిలో తేడాలు ఉన్నట్టు తేలింది. అందులో 15 నమూనాల్లో ప్రజల ఆరోగ్యానికి హాని చేకూర్చే రసాయనాలు, రంగులు వినియోగించినట్టు తేలింది. ఇందులో చికెన్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, ఫిష్‌ ఐటమ్స్‌ ఉన్నాయి. వీటిలో ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కొన్నిరకాల రంగులను అధికంగా వినియోగించినట్టు ఫలితాల్లో తేలింది. అలాగే, మరో 14 నమూనాల్లో నాణ్యత ప్రమాణాలు తక్కువ ఉన్నట్టు వెల్లడైంది. వీటిలో బెల్లం, ఐస్‌క్రీమ్‌లు, స్వీట్లు, జీడి పప్పు పొడి, కేకులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి హోటల్స్‌, రెస్టారెంట్లు, స్వీట్స్‌, బేకరీల యజమానులకు 46 (4) కింద నోటీసులు ఇచ్చినట్టు జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ ఎస్‌.కల్యాణచక్రవర్తి తెలిపారు. 30 రోజుల్లో కొంత మొత్తం డీడీ చెల్లించి మరోసారి పరీక్షలు చేయించుకునే అవకాశం వారికి అందిస్తామన్నారు. మరోసారి పరీక్షలకు ముందుకు రాకపోతే ఇప్పుడు వచ్చిన ఫలితాలను ఫైనల్‌గా నిర్ధారించి కేసులు నమోదు చేయనున్నట్టు వెల్లడించారు. ఆరోగ్యానికి హానికరంగా తేలిన 15 నమూనాలకు సంబంధించిన హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులపై కోర్టుల్లో క్రిమినల్‌ కేసులు పెడతామని, నాణ్యత తక్కువగా ఉన్నట్టు నిర్ధారణ అయిన వాటిపై జాయింట్‌ కలెక్టర్‌ కోర్టుల్లో కేసులు నమోదు చేయనున్నట్టు తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్స్‌ నిల్వ ఉంచిన ఆహారాన్ని వేడి చేసి ప్రజలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బేకరీలు, స్వీట్స్‌ దుకాణ యజమానులు కూడా ప్రమాణాలు పాటించాలన్నారు.


ఉపాధ్యాయ ఎంపిక జాబితా విడుదల

ఉమ్మడి విశాఖ జిల్లాలో 1,139 పోస్టులకు 1,134 భర్తీ

19న విజయవాడలో నియామక పత్రాలు అందజేత

విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ పూర్తయ్యింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,139 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా, 1,134 పోస్టులు భర్తీ అయ్యాయి. జిల్లా పరిషత్‌, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో గల ఇతర పాఠశాలల్లో 625 పోస్టులకు 621, మునిసిపాలిటీల్లో 109 పోస్టులకు 108, గిరిజన సంక్షేమ శాఖలో 400 పోస్టులకు 400, జువెనైల్‌ వెల్ఫేర్‌లో ఐదు పోస్టులకుగాను ఐదూ భర్తీ అయ్యాయి. జిల్లా పరిషత్‌, ప్రభుత్వ, మునిసిపాలిటీల్లో ఎస్‌జీటీ ఉర్దూకు అభ్యర్థులు లేకపోవడంతో ఐదు పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి. జిల్లాల వారీగా ఎంపికైన అభ్యర్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. దీని ప్రకారం విశాఖ జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్య పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో తెలుగు 24, ఇంగ్లీష్‌ 52, హిందీ 28, గణితం 57, ఫిజికల్‌ సైన్స్‌ 36, బయాలజీ 52, సోషల్‌ స్టడీస్‌ 88, ఎస్‌జీటీ తెలుగు 139 పోస్టులు భర్తీ అయ్యాయి. ఎస్‌జీటీ ఉర్దూలో పదికి ఆరు పోస్టులు మాత్రమే భర్తీచేశారు. అలాగే మునిసిపాలిటీల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో తెలుగులో రెండు, ఇంగ్లీష్‌లో మూడు, గణితంలో రెండు, ఫిజికల్‌ సైన్స్‌లో మూడు, బయాలజీలో ఆరు, సోషల్‌ స్టడీస్‌లో మూడు, ఎస్‌జీటీ తెలుగులో 87 పోస్టులు, ఉర్దూలో మూడు పోస్టులకుగాను రెండు భర్తీచేశారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో తెలుగు ఏడు, హిందీ 11, గణితం ఏడు, ఫిజికల్‌ సైన్స్‌ 35, సోషల్‌ సైన్స్‌ ఐదు, ఎస్‌జీటీ తెలుగు 335 పోస్టులు భర్తీ అయ్యాయి. జువెనైల్‌ వెల్ఫేర్‌లో ఎస్‌జీటీ తెలుగు నాలుగు, పీఈటీ ఒక పోస్టు భర్తీ చేశారు.

ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 19న వెలగపూడిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా నియామక పత్రాలు అందించనున్నారు. ఈ సందర్భంగా టాపర్లు కొందరికి మాట్లాడే అవకాశం ఇవ్వనుండడంతో జిల్లా నుంచి ఇద్దరు, ముగ్గురి పేర్లతో జాబితాను అధికారులు పంపించారు. నియామక పత్రాలు అందుకునేందుకు అభ్యర్థులు ఈ నెల 18న ఉదయం 7.30 గంటలకు ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయం స్కూల్‌ నుంచి బస్సులో వెలగపూడికి బయలుదేరుతారు. మెగా డీఎస్సీకి సంబంధించి డీఈవో కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటుచేశారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ 94404 84917, 91772 92969, 96185 84051 నంబర్లకు ఫోన్‌ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చునని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రేమ్‌కుమార్‌ తెలిపారు.


సీఐల బదిలీ

విశాఖపట్నం, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

నగరంలో కొందరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రతబాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎంవీపీ స్టేషన్‌ సీఐగా పనిచేస్తున్న జె.మురళీని విశాఖ రేంజ్‌కు, వెస్ట్‌జోన్‌ క్రైమ్‌ సీఐగా పనిచేస్తున్న ఎన్‌.శ్రీనివాస్‌ను రేంజ్‌ వీఆర్‌కు సరండర్‌ చేశారు. ద్వారకా ట్రాఫిక్‌ సీఐగా పనిచేస్తున్న కేఎన్‌ఎస్‌వీ ప్రసాద్‌ను ఎంవీపీ సీఐగా బదిలీ చేశారు. కంట్రోల్‌ రూమ్‌లో సీఐగా పనిచేస్తున్న ఎన్‌వీ ప్రభాకర్‌రావును ద్వారకా ట్రాఫిక్‌ సీఐగా బదిలీచేశారు. సిటీ వీఆర్‌-2లో ఉన్న మీసాల చంద్రమౌళిని వెస్ట్‌జోన్‌ క్రైమ్‌ సీఐగా బదిలీ చేశారు. సిటీ వీఆర్‌-1 సీఐగా పనిచేస్తున్న బి.భాస్కరరావును పోలీస్‌ కంట్రోల్‌రూమ్‌కు బదిలీ చేశారు.


వేతనాల కోసం ఉక్కు ఉద్యోగుల ఆందోళన

కుటుంబ సభ్యులతో కలిసి నిరసన

ఉక్కుటౌన్‌షిప్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి):

తక్షణమే వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ ప్లాంటు కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఖాళీ కంచాలు ప్రదర్శిస్తూ...వెంటనే జీతాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ గౌరవధ్యక్షుడు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ ఉక్కు ఉద్యోగులకు జీతాలు చెల్లించామని కేంద్ర మంత్రి చెప్పడం అత్యంత దుర్మార్గమన్నారు. కార్మికులకు గత ఏడాది కాలంగా సరిగ్గా జీతాలు ఇవ్వడం లేదన్నారు. జీతాల కోసం అడిగిన కార్మిక నాయకులకు షోకాజు నోటీసులు ఇవ్వడం సరికాదన్నారు. జీతాల విషయంలో స్ధానిక ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు వైటీ దాసు, యు.రామస్వామి, పి.శ్రీనివాసరాజు, కె.గంగాధర్‌, రాజు, పుల్లారావు, అప్పారావు, ప్రసాద్‌ పాల్గొన్నారు.

ఇంటక్‌ ఆధ్వర్యంలో....

జీతాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఇంటక్‌ ఆధ్వర్యంలో బీసీ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్‌ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌ మాట్లాడుతూ జీతాల కోసం ప్రతి నెలా ఎదురు చూపులు తప్పడం లేదన్నారు. సంస్ధ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో నాయకులు పీవీ రమణమూర్తి, బీఎన్‌ రాజు, నీరుకొండ రామచంద్రరావు, కొమ్ము ప్రసాద్‌, వెంకన్న, ఈశ్వరరావు, పోతారెడ్డి, అవతారం పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2025 | 01:05 AM