వారపు సంతలకు దసరా తాకిడి
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:35 AM
వచ్చే వారం దసరా పండుగ నేపథ్యంలో అచ్యుతాపురం, మోసయ్యపేటలో సంతలు శుక్రవారం నాటుకోళ్లు, గొర్రెలు, మేకల క్రయవిక్రయదారులతో రద్దీగా మారాయి. దసరా పండుగ రోజున మాంసాహార వంటకాలు చేసుకోవడం ఆనవాయితీ. దీంతో నాటుకోళ్లు, మేకలు, గొర్రెలకు గిరాకీ ఏర్పడుతుంది. వీటి పెంపకందారులు మంచి ధర లభిస్తుందన్న ఉద్దేశంతో దసరా పండుగ సమయంలో సంతలకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు.
నాటుకోళ్లు, గొర్రెలు, మేకలను తీసుకువచ్చి అమ్మకందారులు
పండుగ కావడంతో అధిక గిరాకీ
సాధారణ రోజులతో పోలిస్తే 20 శాతం మేర పెరిగిన ధరలు
అచ్యుతాపురం, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వచ్చే వారం దసరా పండుగ నేపథ్యంలో అచ్యుతాపురం, మోసయ్యపేటలో సంతలు శుక్రవారం నాటుకోళ్లు, గొర్రెలు, మేకల క్రయవిక్రయదారులతో రద్దీగా మారాయి. దసరా పండుగ రోజున మాంసాహార వంటకాలు చేసుకోవడం ఆనవాయితీ. దీంతో నాటుకోళ్లు, మేకలు, గొర్రెలకు గిరాకీ ఏర్పడుతుంది. వీటి పెంపకందారులు మంచి ధర లభిస్తుందన్న ఉద్దేశంతో దసరా పండుగ సమయంలో సంతలకు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. కొనుగోలుదారులు సైతం సంతల్లో సరసమైన ధరలకు లభిస్తాయన్న భావంతో వస్తుంటారు. శుక్రవారం అనకాపల్లి జిల్లాతోపాటు విశాఖ, విజయనగరం, కాకినాడ జిల్లాల నుంచి మేకలు, గొర్రెల కొనుగోలుదారులు వచ్చారు. సాధారణ రోజులతోపోలిస్తే నాటుకోళ్లు, జీవాల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయి. సుమారు 20 కిలోల బరువున్న గొర్రెపోతు రూ.12 వేల నుంచి రూ.14 వేల వరకు ధర పలికింది. అదే విధంగా రెండు కిలోల బరువున్న నాటుకోళ్లను అటుఇటుగా రూ.2 వేలకు విక్రయించారు.