Share News

పరిశ్రమల వ్యర్థాలు డంపింగ్‌

ABN , Publish Date - Jun 25 , 2025 | 12:02 AM

స్థానిక ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్‌లోని పలు కంపెనీలకు చెందిన వ్యర్థాలను రాత్రిపూట ప్రధాన రహదారుల వెంబడి డంప్‌చేస్తున్నారు. పరవాడ రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 11లోని కొండ ప్రాంతంలో కూడా వ్యర్థాలను ఇష్టానుసారంగా పారబోస్తున్నారు.

పరిశ్రమల వ్యర్థాలు డంపింగ్‌
పరవాడ రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 11లో డంప్‌ చేసిన పారిశ్రామిక వ్యర్థాలు

రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో పారబోస్తున్న కంపెనీల యాజమాన్యాలు

నిప్పు పెడుతుండడంతో భరించలేని వాసన

కలుషితం అవుతున్న భూగర్భ జలాలు

అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికుల ఆరోపణ

పరవాడ, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఫార్మాసిటీ, అచ్యుతాపురం సెజ్‌లోని పలు కంపెనీలకు చెందిన వ్యర్థాలను రాత్రిపూట ప్రధాన రహదారుల వెంబడి డంప్‌చేస్తున్నారు. పరవాడ రెవెన్యూ పరిధి సర్వే నంబర్‌ 11లోని కొండ ప్రాంతంలో కూడా వ్యర్థాలను ఇష్టానుసారంగా పారబోస్తున్నారు. వీటికి నిప్పు పెట్టడంతో విషవాయువులు వెలువడి, భరించలేని దుర్వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడు వ్యర్థాలు తడిచిపోయి, కలుషిత నీరు భూమిలోకి ఇంకుతున్నదని, దీంతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని వాపోతున్నారు. పారిశ్రామిక వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ డంపింగ్‌ చేయడంపై అధికారులకు ఫిర్యాదు చేసినా, పత్రికల్లో కథనాలు వచ్చినా పట్టించుకోవడంలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా కంపెనీలు, ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి, వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో డంపింగ్‌ చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Jun 25 , 2025 | 12:02 AM