కలెక్టరేట్ ఎదుట మూగ మహిళ ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Aug 05 , 2025 | 01:17 AM
కలెక్టరేట్ ఎదుట సోమవారం బధిరురాలైన (మూగ) ఓ మహిళ తనతోపాటు ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
తనతోపాటు ఇద్దరు బిడ్డలపై పెట్రోల్ పోసుకుని అఘాయిత్యం
అడ్డుకున్న పోలీసులు.. కలెక్టర్, ఎస్పీ దృష్టికి సమస్య
కౌన్సెలింగ్ చేసిన విజయకృష్ణన్
కొన్నేళ్ల నుంచి భర్త వేధిస్తున్నాడని ఆవేదన
ఫిర్యాదు చేసినా.. మునగపాక ఎస్‌ఐ పట్టించుకోలేదని ఆరోపణ
మీడియాకు వెల్లడించిన కుమార్తె
అనకాపల్లి కలెక్టరేట్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):
కలెక్టరేట్ ఎదుట సోమవారం బధిరురాలైన (మూగ) ఓ మహిళ తనతోపాటు ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే వున్న అనకాపల్లి రూరల్ సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ రవికుమార్ అడ్డుకొన్నారు. ఆమె సమస్యను కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ స్పందించి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి బాధితురాలి కుమార్తె పల్లవి తెలిపిన వివరాలిలా వున్నాయి.
మునగపాక మండలం తోటాడ సిరసపల్లి గ్రామానికి చెందిన యాండ్ర సంతోషమ్మకు పుట్టుకతోనే బధిరురాలు. కొన్నేళ్ల క్రితం దుర్గాప్రసాద్ అనే లారీ డ్రైవర్ ఈమెను వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరికి కుమారుడు, కుమార్తె కలిగారు. ప్రస్తుతం కుమారుడు సంజీవ్ పదో తరగతి, కుమార్తె పల్లవి తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కాగా దుర్గాప్రసాద్ కొద్ది రోజుల నుంచి భార్యతో గొడవపడుతూ ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. గత నెల పదో తేదీన డ్రైవర్ విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన దుర్గాప్రసాద్.. భార్యతోపాటు పిల్లలను కూడా కొట్టాడు. వేధింపులు భరించలేక ఆమె మునగపాక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్తపై ఫిర్యాదు చేసింది. భార్యను, పిల్లలను కొట్టి, చిత్ర హింసలకు గురిచేయాలంటూ అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్గాప్రసాద్‌ను ప్రేరేపిస్తున్నారని, వారిపైనా కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఎస్‌ఐ కేసు నమోదు చేయలేదు. దీంతో గత నెల 28వ తేదీన కలెక్టరేట్‌కు వచ్చి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ మునగపాక పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో సోమవారం కలెక్టరేట్ ఎదుట బిడ్డలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బాటిల్‌లో పెట్రోల్ తీసుకువచ్చి, శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సమయంలో అక్కడ వున్న అనకాపల్లిరూరల్ సీఐ జి.అశోక్‌కుమార్, ఎస్‌ఐ రవికుమార్‌లు అడ్డుకొన్నారు. విషయం తెలుసుకుని కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్‌సిన్హా దృష్టికి తీసుకువెళ్లారు. కలెక్టర్ స్పందించి ఆమెకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.