నేడు డీఎస్సీ ఎంపిక జాబితా
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:25 AM
డీఎస్సీలో మెరిట్ మేరకు ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థుల జాబితా సోమవారం విడుదల కానున్నది. ఎంపికైన అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితాలను జిల్లాల వారీగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దీంతోపాటు అభ్యర్థుల వివరాలతో ముద్రించిన కాపీలు జిల్లా కలెక్టర్, డీఈవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. సబ్జెక్టు, రిజర్వేషన్ల వారీగా మెరిట్, కటాఫ్ మార్కుల వివరాలతో అభ్యర్థుల వివరాలు వెల్లడికానున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 1,134 మందికి ఉద్యోగాలు
ఐదు ఉర్దూ ఎస్జీటీ పోస్టులకు అభ్యర్థుల కరువు
19న అమరావతిలో నియామకపత్రాల అందజేత
22వ తేదీ నుంచి జిల్లాలో రెసిడెన్షియల్ శిక్షణ
విశాఖపట్నం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీలో మెరిట్ మేరకు ఉపాధ్యాయులుగా ఎంపికైన అభ్యర్థుల జాబితా సోమవారం విడుదల కానున్నది. ఎంపికైన అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితాలను జిల్లాల వారీగా వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దీంతోపాటు అభ్యర్థుల వివరాలతో ముద్రించిన కాపీలు జిల్లా కలెక్టర్, డీఈవో కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. సబ్జెక్టు, రిజర్వేషన్ల వారీగా మెరిట్, కటాఫ్ మార్కుల వివరాలతో అభ్యర్థుల వివరాలు వెల్లడికానున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 1,139 పోస్టులకుగాను 1,134 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉర్దూ ఎస్జీటీ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లభించలేదు. దీంతో ఐదు పోస్టులను పెండింగ్‌లో ఉంచారు. మిగిలిన పోస్టుల్లో కేటగిరీల వారీగా జడ్పీ, మునిసిపల్, ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో ఎస్జీటీలు 239, స్కూల్ అసిస్టెంట్, తత్సమాన వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు 495, గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఎస్జీటీలు 335, స్కూల్ అసిస్టెంట్ 65 పోస్టులకు మెరిట్ జాబితా మేరకు సర్టిఫికెట్ల పరిశీలన పూర్తిచేశారు. మొత్తం 1,134 మంది అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితాపై అభ్యంతరాలు తెలుసుకునేందుకు వీలుగా రెండు రోజుల కిందటే జాబితాను జిల్లాకు పంపారు. జాబితాను పరిశీలించిన విద్యా శాఖ తిరిగి పాఠశాల విద్యాశాఖకు పంపింది.
19న నియామక పత్రాలు
డీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19వ తేదీన రాజధాని అమరావతిలో నియామకపత్రాలు అందజేస్తారు. 22వ తేదీ నుంచి వారందరికీ జిల్లాలో రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం 80 మంది టీచర్లను రిసోర్స్ పర్సన్లుగా ఎంపికచేశారు. ఎస్జీటీలు, సబ్జెక్టు వారీగా స్కూల్ అసిస్టెంట్లకు వేర్వేరుగా శిక్షణ అందిస్తారు. అయితే మొత్తం 1,134 మందికి ఒకేచోట శిక్షణ ఇచ్చేందుకు అనువుగా ఉండే వేదికను ఎంపిక చేసేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తున్నది. దీంతో పాటు సబ్జెక్టు టీచర్లకు మూడు జిల్లాల్లో వేర్వేరుగా శిక్షణ ఇచ్చే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నామని విశాఖ డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు.