నేడు డీఎస్సీ మెరిట్ జాబితా
ABN , Publish Date - Aug 22 , 2025 | 01:13 AM
ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీ రాత పరీక్షకు సంబంధించి మెరిట్ జాబితా శుక్రవారం విడుదల చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా విడుదల
24 లేదా 25న సర్టిఫికెట్ల పరిశీలన?
ఉక్కు టౌన్‌షిప్‌లోని విశాఖ విమల విద్యాలయం ఎంపిక
ఎంఈవో/హెచ్‌ఎం/డిప్యూటీ తహశీల్దారుతో కూడిన 31 బృందాల నియామకం
మొత్తం పోస్టులు 1,139
అల్లూరి జిల్లాలో 400 పోస్టులు,
సిటీ, మైదాన ప్రాంతంలో 739...
విశాఖపట్నం, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి):
ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించిన డీఎస్సీ రాత పరీక్షకు సంబంధించి మెరిట్ జాబితా శుక్రవారం విడుదల చేయనున్నారు. ఐదారు రోజులుగా తర్జనభర్జన పడిన పాఠశాల విద్యా శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి జిల్లాల వారీగా మెరిట్ జాబితాలను రూపొందించారు. ఆ జాబితాలు జిల్లాలకు పంపుతారు. అదే సమయంలో వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.
డీఎస్సీ రాత పరీక్షలో వచ్చిన మార్కులు, టెట్‌లో వచ్చిన మార్కులను కలిపి మెరిట్ జాబితా తయారుచేశారు. దీంట్లో ఏమైనా తప్పులు ఉన్నాయా? అన్నది ఒకటికి రెండుసార్లు సరి చూస్తున్నారు. శుక్రవారం మెరిట్ జాబితా విడుదల చేస్తారు. ఉమ్మడి జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 1,139 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. వాటిలో 400 పోస్టులు అల్లూరి సీతారామరాజు జిల్లాలో, మిగిలిన 739 పోస్టులు నగరం, మైదాన ప్రాంతాల్లో ఉన్నాయి. మొత్తం 1,139 పోస్టుల భర్తీకి ఇప్పటికే జిల్లా అధికారులు రోస్టర్ పాయింట్లు రూపొందించి పాఠశాల విద్యాశాఖకు పంపారు. రోస్టర్ పాయింట్లు ఆధారంగానే మెరిట్ జాబితా ఖరారు చేశారు. దీని ఆధారంగా విశాఖపట్నంలో ఈనెల 24 లేదా 25వ తేదీ నుంచి అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేస్తారని అంచనా వేస్తున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఉక్కుటౌన్‌షిప్‌లోని విశాఖ విమల విద్యాలయాన్ని ఎంపిక చేశారు. ఆ పాఠశాలలో 31 గదులలో సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లుచేస్తున్నారు. ప్రతి గదిలో 50 మంది వంతున అభ్యర్థులను కూర్చోబెట్టి వారి నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని పరిశీలన చేస్తారు. డీఎస్సీ రాత పరీక్షకు పెట్టుకున్న దరఖాస్తుకు జత చేసిన సర్టిఫికెట్ల నకళ్లతో సరిచూస్తారు. దరఖాస్తులకు జత చేసిన నకళ్ల వివరాలను ఆన్‌లైన్‌లోనే పరిశీలన చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన కోసం ప్రతి గదికి ఎంఈవో/హెచ్‌ఎం/డిప్యూటీ తహశీల్దారుతో కూడిన బృందాలను నియమించారు. అంటే 31 మంది ఎంఈవోలు, హెచ్‌ఎంలు, డీటీలకు డ్యూటీలు వేశారు. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఈ మేరకు విశాఖ డీఈవో ప్రేమ్‌కుమార్‌కు ఆదేశాలు జారీచేశారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో 1ః1 ప్రాతిపదికగానే పిలుస్తున్నారు. అంటే 1,139 మందిని పిలుస్తారు. ఒకవేళ ఒక అభ్యర్థి రెండు, మూడు పోస్టులు దక్కించుకునే మార్కులు సంపాదిస్తే ఒక పోస్టును మాత్రమే అతను ఎంపిక చేసుకోవాలి. అటువంటి సందర్భాలలో సదరు అభ్యర్థి తరువాత మార్కులు తెచ్చుకునే అభ్యర్థికి అవకాశం ఇస్తారు. ఇక్కడ కూడా రోస్టర్ పాయింట్లను పరిగణనలోకి తీసుకుంటారు. సర్టిఫికెట్ల పరిశీలన ముగిసిన తరువాత నియామక పత్రాలు అందజేసే ప్రక్రియ చేపడతారు. దీనిపై స్పష్టత రావలసి ఉంది.