Share News

ఢీఎస్సీ..

ABN , Publish Date - Apr 21 , 2025 | 12:42 AM

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఢీఎస్సీ..

  • ఉపాధ్యాయ నియామకాలకు అధిక పోటీ

  • ఉమ్మడి జిల్లాలో మొత్తం పోస్టులు 1,139

  • ఎస్జీటీలు 575, స్కూల్‌ అసిస్టెంట్‌లు 564

  • ఎస్జీటీల్లో అత్యధికంగా 335 పోస్టులు ఏజెన్సీలోని గిరిజన ఆశ్రమాల్లో..

  • ఎంపీపీ/మునిసిపల్‌/ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలు 239 మాత్రమే!

  • అభ్యర్థులు 35 వేల మంది ఉండవచ్చని అంచనా

  • పోస్టులు తగ్గడానికి గత ప్రభుత్వ నిర్వాకమే కారణమా?

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి):

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సుమారు ఆరేళ్ల నుంచి డీఎస్సీ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జూన్‌లో నిర్వహించనున్న రాత పరీక్షలకు ఆదివారం నుంచే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో అన్ని కేటగిరీలు కలిపి 1,139 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులు 575, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 564 ఉన్నాయి. సెకండరీ గ్రేడ్‌ కేటగిరీలో 575 పోస్టులకు గాను గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఖాళీలు 335 వుండగా, ఎంపీపీ/మునిసిపల్‌/ప్రభుత్వ పాఠశాలల్లో 239 ఖాళీలు మాత్రమే వున్నాయి. ఉమ్మడి జిల్లాలో డీఈడీ, బీఈడీ/తత్సమాన కోర్సులు చదివి డీఎస్సీ కోసం సుమారు 35 వేలమంది అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. వీరిలో డీఈడీ కోర్సు చేసిన వారి కంటే బీఈడీ/తత్సమాన కోర్సులు చదివినవారే ఎక్కువగా ఉంటారని అంచనా వేస్తున్నారు.

పోస్టులు తగ్గడానికి..

పోస్టులు తగ్గిపోవడానికి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఉమ్మడి జిల్లాలో ఎంపీపీ/ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్ట్టులు 5,931 ఉండగా ప్రస్తుతం 5,233 మంది టీచర్లు పనిచేస్తున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో 5,143 పోస్టులకుగాను 4,823 మంది పనిచేస్తున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జీవో నంబర్‌-117ను అమలు చేయడం ద్వారా ప్రాథమిక విద్యను చాలావరకు దెబ్బతీశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులను సమీపంలో ఉన్న పాఠశాలల్లో విలీనం చేయడం, ఇతరత్రా కారణాలతో అక్కడ చదివే పిల్లలపై ప్రభావం పడింది. గడిచిన మూడేళ్లలో ప్రభుత్వ యాజమాన్య ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలో సుమారు 420 ఎస్జీటీ టీచర్లను మిగులుగా చూపిస్తున్నారు. దీనికితోడు టీచర్‌, విద్యార్థి నిష్పత్తి మేరకు ఖాళీలను భర్తీ చేస్తుండడంతో ఎస్జీటీల నియామకాలను తక్కువగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయంచింది. అయితే గత ప్రభుత్వం తీసుకువచ్చినజీవో 117ను రద్దు చేసిన ప్రస్తుత ప్రభుత్వం... కొత్త విధానాలను అమలు చేయనున్నది. ఇందువల్ల మోడల్‌, బేసిక్‌ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నందున వచ్చే ఏడాదికి పిల్లల చేరికపై కొంత పురోగతి ఉండవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత డీఎస్సీలో తక్కువ పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నందున ఆశావహుల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని చెప్పవచ్చు.

ఏజెన్సీలో 400 ఖాళీలు

ఉమ్మడి విశాఖ జిల్లా పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 400 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మూడేళ్ల క్రితం వరకు జీవో నంబరు-3 ప్రకారం ఏజెన్సీలో వున్న టీచర్‌ పోస్టులన్నీ గిరిజన అభ్యర్థులతోనే భర్తీ చేసేవారు. అయితే ఈ జీవోను 2022లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కారణంగా ఐదో షెడ్యూల్‌ల్‌ వున్న ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలకు గిరిజనులతోపాటు గిరిజనేతరులకు అవకాశం వచ్చింది. గత ఏడాది సాధారణ ఎన్నికల సమయంలో జీవో నంబరు-3 పునరుద్ధరణకు కృషి చేస్తానని విపక్షనేత హోదాలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అన్ని పోస్టులను గిరిజనులతో భర్తీచేయాలని ఆదివాసీ అభ్యర్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 21 , 2025 | 12:42 AM