విమ్స్‌లో ఔషధ నియంత్రణ విభాగం కార్యాలయం, ల్యాబ్
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:08 AM
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఔషధ నియంత్రణ విభాగం కార్యాలయ భవనాలు, లేబొరేటరీని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ మంగళవారం ఉదయం వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
వర్చువల్‌గా ప్రారంభించిన వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వై.సత్యకుమార్ యాదవ్
ఆరిలోవ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (విమ్స్) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఔషధ నియంత్రణ విభాగం కార్యాలయ భవనాలు, లేబొరేటరీని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ మంగళవారం ఉదయం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలంతా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్ఠి సాధించడం సాధ్యపడుతుందన్నారు. విశాఖ, కర్నూలుల్లో డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్స్‌ను ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని భవనాలను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఔషధ నియంత్రణ విభాగాలు ఏర్పాటు కావడం ఆనందంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేస్తోందన్నారు. కార్యక్రమంలో ఔషధ నియంత్రణ విభాగం డిప్యూటీ డైరక్టర్ కె.రజిత, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.విజయ్ కుమార్, విమ్స్ డైరెక్టర్ కె.రాంబాబు, స్థానిక కార్పొరేటర్ మద్దిల రామలక్ష్మి, 13వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఒమ్మి సన్యాసిరావు, నాయకులు బుడమూరు గోవింద్, తదితరులు పాల్గొన్నారు. ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్ ఎం.పాండురంగారావు వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు తనిఖీల సమయంలో అనుమానం వచ్చి సేకరించిన నమూనాలను ఔషధ నియంత్రణ విభాగంలో పరీక్షిస్తారు. టాబ్లెట్స్, దగ్గు మందులు, ఇతర ఔషధాలను పరీక్షిస్తారు.
రాంబిల్లిలో సోలార్ కంపెనీ
రూ.3,990 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ‘రెన్యూ ఎనర్జీ’ సంస్థ సిద్ధం
ప్లేట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు
హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టు, గ్రీన్ అమ్మోనియా ప్లాంటు,
ఐదు గిగావాట్ల హైబ్రిడ్ రెన్యువబుల్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రతిపాదనలు
మొత్తం పెట్టుబడి రూ.82 వేల కోట్లు
విశాఖపట్నం, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి):
దేశంలో తొలి ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్‌గాట్ అండ్ వేఫర్ తయారీ పరిశ్రమ అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఏర్పాటు కానుంది. సోలార్ విద్యుత్ తయారీకి అవసరమైన ఫొటోవాల్టిక్ (సోలార్) పలకలను ప్రస్తుతం విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల సోలార్ విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో అనేక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. వాటికి అవసరమైన ముడి సరకుకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇక్కడే వాటిని తయారుచేయాలని ‘రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్‌సీ’ అనే సంస్థ రూ.3,999 కోట్లతో రాంబిల్లిలో ఇంటిగ్రేటెడ్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకువచ్చింది. దీనికోసం రెన్యూ ఫొటోవాల్టాయిక్స్ పేరుతో అనుబంధ సంస్థను ఏర్పాటుచేసింది. ఆరు గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటుచేసే ఈ ప్లాంటు కోసం రాంబిల్లిలో 130 నుంచి 140 ఎకరాలు కావాలని కోరింది. రాష్ట్ట్ర పెట్టుబడుల ప్రమోషన్ బోర్డు సిఫారసుతో ఈ ఫైల్ వచ్చే వారం రాష్ట్ర మంత్రివర్గం క్లియరెన్స్‌కు వెళుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అనుమతులు రాగానే పనులు ప్రారంభించి నిర్మాణాన్ని 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని, వాణిజ్య కార్యకలాపాలను 2028 జనవరికి ప్రారంభిస్తామని సంస్థ తన ప్రతిపాదనల్లో పేర్కొంది.
దీంతో పాటు రెండు గిగావాట్ల హైడ్రో స్టోరేజీ ప్రాజెక్టు, 300 కీటీపీఏ సామర్థ్యంతో గ్రీన్ అమ్మోనియా ప్లాంటు, ఐదు గిగావాట్ల హైబ్రిడ్ రెన్యువబుల్ ప్రాజెక్టులు (విండ్, సోలార్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్) ఏర్పాటుచేస్తుంది. వీటన్నింటికీ కలిపి రూ.82 వేల కోట్లు పెట్టుబడి పెడతామని ఇటీవల జరిగిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందం చేసిందని తెలిసింది. వీటిని నడపడానికి రోజుకు 95 మెగావాట్ల నిరంతర విద్యుత్, రోజుకు పది మిలియన్ లీటర్ల నీరు అవసరమని, అందుకు తగిన ఏర్పాట్లుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.