Share News

వ్యవసాయ రంగంలో డ్రోన్లు

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:23 PM

ఇతర రంగాల్లో మాదిరిగానే వ్యవసాయ రంగంలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతున్నది. ఇందులో భాగంగా పురుగు మందుల పిచికారీ, ద్రవ రూపంలో వుండే రసాయన, జీవన ఎరువులను చల్లడానికి డ్లోన్లను వాడుతున్నారు.

వ్యవసాయ రంగంలో డ్రోన్లు
పంటలకు పరుగు నివారణ మందును పిచికారీ చేసే డ్రోన్‌..

పురుగు మందులు, ద్రవ ఎరువుల పిచికారీకి వినియోగం

ఎకరా విస్తీర్ణంలో పది నిమిషాల్లో పని పూర్తి

ప్రతి మొక్కకూ సమానంగా మందు

సమయంతోపాటు కూలి ఖర్చులు ఆదా

డ్రోన్‌ ఖరీదుపై 40 శాతం రాయితీ ఇస్తున్న ప్రభుత్వం

50 శాతం బ్యాంకు నుంచి రుణ సదుపాయం

డ్రోన్ల వినియోగంపై వ్యవసాయ వర్సిటీలో శిక్షణ

రాంబిల్లి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఇతర రంగాల్లో మాదిరిగానే వ్యవసాయ రంగంలో కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెరుగుతున్నది. ఇందులో భాగంగా పురుగు మందుల పిచికారీ, ద్రవ రూపంలో వుండే రసాయన, జీవన ఎరువులను చల్లడానికి డ్లోన్లను వాడుతున్నారు. తక్కువ ఖర్చు, తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో మందులు, ఎరువులను వేసుకోవచ్చని బీసీటీ కృషి విజ్ఞాన కేంద్రం యాంత్రీకరణ శాస్త్రవేత్త శ్రీకాంతగౌడ చెబుతున్నారు. భవిష్యత్తులో డ్రోన్‌ టెక్నాలజీతో భారత వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన అంటున్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయన వెల్లడించిన వివరాలిలా వున్నాయి.

పొలాల్లో పనులు చేసే కూలీల సంఖ్య రానురాను తగ్గిపోతున్న. దీనివల్ల కూలి రేట్లు పెరిగిపోయి పంట సాగు వ్యయం అధికం అవుతున్నది. దీనివల్ల రైతులకు ఆర్థికంగా భారం పడుతున్నది. విత్తనాలు/ వరినాట్లు వేయడం, కలుపుతీత, పంట కోత, నూర్పిడి వంటి పనులు చేయడానికి ఇప్పటికే యంత్రాలను వినియోగిస్తున్నార. ఇప్పుడు పురుగు మందుల పిచికారీ, రసాయన/ జీవన ఎరువులు పిచికారీ చేయడానికి డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ విస్తీర్ణంలో వీటిని పిచికారీ చేయవచ్చు. పైగా పొలం అంతటా ఒకే రీతిలో మందు పిచికారీ అవుతుంది. పది లీటర్ల మందు నీరు పట్టే ట్యాంకు వున్న డ్రోన్‌ సాయంతో ఒక ఎకరా విస్తీర్ణంలో గరిష్ఠంగా పది నిమిషాల్లో పిచికారీ చేయవచ్చు. కూలీలతో మందును పిచికారీ చేయించే సమయంతో పోలిస్తే ఇది నాలుగు శాతమే! మొత్తంగా 96 శాతం సమయం, 90 శాతం నీటిని ఆదా చేస్తాయి. అంతేకాక మొక్కల అన్ని భాగాలకు సమానంగా మందు తగులుతుంది. తద్వారా తెగుళ్లు త్వరగా నియంత్రణ అవుతాయి. దీనివల్ల పురుగు మందుల ఖర్చులు తగ్గి, ఆశించిన స్థాయిలో పంట దిగుబడి వస్తుంది. వరి, చెరకు, పత్తి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు డ్రోన్లతో మందులను పిచికారీ చేయవచ్చు. కొండవాలు ప్రదేశాల్లో (టెర్రస్‌ ఫార్మింగ్‌) పంటలు సాగు చేసే ఏజెన్సీ ప్రాంతంలో డ్రోన్ల వినియోగం మంచి ఫలితాలను ఇస్తుంది. డ్రోన్లతో పురుగు మందులను పిచికారీ చేయడం వల్ల రైతులపై మందుల ప్రభావం ఒక్క శాతం కూడా పడదు.

డ్రోన్‌లపై 40 శాతం సబ్సిడీ

వ్యవసాయ రంగంలో వినియోగించే డ్రోన్ల ఖరీదు రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వుంటుంది. ఐదుగురు రైతులను ఒక బృందంగా ఏర్పడి, వ్యవసాయ శాఖ కార్యాలయం/ రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకొని డ్రోన్‌ కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం సబ్సిడీ ఇస్తుంది. బ్యాంకుల నుంచి 50 శాతం రుణం అందిస్తారు. మిగిలిన 10 శాతం ఖర్చును మాత్రమే రైతులు చెల్లించాల్సి వుంటుంది. డ్రోన్ల నిర్వహణ, వినియోగంపై గుంటూరులోని డాక్టర్‌ ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లేదా అమరావతిలో 12 రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇస్తారు. మరింత సమాచారం కోసం 84311 05162 (శ్రీకాంతగౌడ) నంబర్‌కు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చు.

Updated Date - Oct 07 , 2025 | 11:23 PM