వైద్య రంగంలో డ్రోన్ సేవలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 01:14 AM
మన్యంలోని భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో వైద్య రంగంలో డ్రోన్‌లను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా పాడేరు కేంద్రంగా పలు పీహెచ్‌సీలకు డ్రోన్‌ను పంపిస్తూ దాని అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సేవలందించే క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఆయా సేవలను అందించేందుకు గాను డ్రోన్‌ను వినియోగించాలని భావిస్తున్నారు.
- మందులు, రక్త పరీక్షల నమూనాలను తరలించేందుకు వినియోగించాలని యోచన
- జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలన
- విజయవంతమైతే వచ్చే ఏడాది నుంచి పూర్తి స్థాయిలో అమలు చేసే అవకాశం
- భవిష్యత్తులో కేజీహెచ్‌కి అనుసంధానం
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలోని భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో వైద్య రంగంలో డ్రోన్‌లను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. ఇందులో భాగంగా పాడేరు కేంద్రంగా పలు పీహెచ్‌సీలకు డ్రోన్‌ను పంపిస్తూ దాని అమలును ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సేవలందించే క్రమంలో అత్యవసర పరిస్థితుల్లో తక్కువ సమయంలో ఆయా సేవలను అందించేందుకు గాను డ్రోన్‌ను వినియోగించాలని భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఈ ప్రాజెక్టును సంపూర్ణంగా విజయవంతం చేసి పాడేరు ప్రభుత్వాస్పత్రి నుంచి వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు, పరీక్షల నమూనాలను తరలించనున్నారు. అలాగే భవిష్యత్తులో మన్యానికి, కేజీహెచ్‌కు డ్రోస్ సేవలను అనుసంధానం చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నారు.
భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో డ్రోన్ వినియోగం
ఏజెన్సీ ప్రాంతంలో ఆస్పత్రులు, ఆరోగ్య ఉపకేంద్రాల మధ్య, అలాగే ఆస్పత్రికి గ్రామాలకు మధ్య దూరం ఎంతో ఉంటుంది. ఈ క్రమంలో సకాలంలో మందులు అందుబాటులో లేకపోవడం, వ్యాధి నిర్ధారణ పరీక్షల ఫలితాలు ఆలస్యం కావడం వంటి సమస్యలు నిత్యకృత్యం. వాటిని మరింత వేగవంతం చేస్తే గిరిజన రోగులకు సకాలంలో వైద్య సేవలు అందడంతో పాటు సమయం ఆదా అవుతుందనేది రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆలోచన. దీంతో వైద్య రంగానికి సాంకేతికతను జోడించి, మరింత వేగంగా అత్యవసర సేవలు అందించేందుకు ప్రణాళిక రచించారు. ఇందులో భాగంగానే మన్యం ప్రాంతంలో డ్రోన్ సేవలను వైద్య రంగంలో ఎలా వినియోగించుకోవచ్చుననే అంశంపై ప్రస్తుతం ప్రయోగాత్మక చర్యలు చేపడుతున్నారు. పాడేరులోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు మందులు పంపిణీ చేయడం, అలాగే పలు వ్యాధుల నిర్ధారణకు సంబంధించిన నమూనాల సేకరణ రవాణా, ఫలితాలు అందజేత వంటి పనులకు డ్రోన్ సేవలను వినియోగించాలనుకుంటున్నారు. ప్రస్తుతం మూడు కిలోల బరువుతో 45 నిమిషాల్లో 80 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యమున్న ఒక డ్రోన్‌ను పాడేరు నుంచి ప్రయోగాత్మకంగా ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ముంచంగిపుట్టు, అరకులోయ మండలం సుంకరమెట్ట, చింతపల్లి మండలం తాజంగి పీహెచ్‌సీలకు పాడేరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నుంచి మందులు పంపడం వంటి ప్రయోగాత్మక చర్యలు చేపట్టారు. అలాగే 80 కిలో మీటర్ల దూరంలో ఉన్న పీహెచ్‌సీకు డ్రోన్ సేవలు అందించే ప్రయోగాలు చేయనున్నారు.
భవిష్యత్తులో కేజీహెచ్‌కి అనుసంధానం
పాడేరు ప్రభుత్వాస్పత్రి కేంద్రంగా ఏజెన్సీలో వినియోగించే డ్రోన్ సేవలను భవిష్యత్తులో కేజీహెచ్‌కు అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. విశాఖపట్నం ప్రాంతం డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉండడంతో భారీ డ్రోన్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. అయితే ఆ అనుమతి వచ్చే సమయానికి ఏజెన్సీలో డ్రోన్ సేవలపై జరుగుతున్న ప్రయోగాన్ని సంపూర్ణంగా విజయవంతం చేయాలనే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ ఉంది. అన్నీ అనుకున్న విధంగా జరిగితే మన్యంలోని వైద్య రంగానికి డ్రోన్ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ డి.హేమలతాదేవి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు.