Share News

డీఆర్వో వర్సెస్‌ ఆర్డీవో

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:10 AM

జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్‌ భవానీశంకర్‌, విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ మధ్య వివాదం అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.

డీఆర్వో వర్సెస్‌ ఆర్డీవో

రెవెన్యూలో కలకలం

తహశీల్దార్‌ కార్యాలయాల సిబ్బందికి నెలనెలా డీఆర్‌వో ఇండెంట్‌ పెడుతున్నారని కలెక్టర్‌కు ఆర్డీవో ఫిర్యాదు

అమరావతి నుంచి ఉన్నతాధికారుల ఆరా

మరోవైపు మండల కార్యాలయాల నుంచి సమాచారం సేకరించిన నిఘా వర్గాలు

కలెక్టర్‌ను కలిసి రెవెన్యూ అసోసియేషన్‌

విశాఖపట్నం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి):

జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్‌ భవానీశంకర్‌, విశాఖ ఆర్డీవో పి.శ్రీలేఖ మధ్య వివాదం అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంపై శుక్రవారం రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు ఆరా తీశారు.

డీఆర్‌వో ప్రతి నెలా నిత్యావసర సరుకుల కోసం తహశీల్దారు కార్యాలయ సిబ్బందికి ఇండెంట్‌ పెడుతున్నారని ఆర్డీవో గురువారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం లీక్‌ కావడంతో మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో అమరావతి నుంచి రెవెన్యూ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఫోన్‌ చేసి అన్ని వివరాలు అడిగారు. పెందుర్తి మండలం ఏకలవ్య కాలనీలో అంబేడ్కర్‌ విగ్రహం తొలగింపునకు యత్నం గురించి కూడా ఆరా తీసినట్టు తెలిసింది. ఆర్డీవో వ్యవహారశైలిపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని చెప్పినట్టు తెలిసింది. ఇదిలావుండగా ఆర్డీవోకు ప్రభుత్వంలో కీలక వ్యక్తుల ఆశీస్సులు, డీఆర్వోకు సీఎంవో కీలక అధికారి దన్ను ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. గత ఏడాదే ఇరువురు అధికారులు జిల్లాకు బదిలీపై వచ్చారు. కొద్దిరోజులు బాగానే ఉన్నా...ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదుకాని డీఆర్వో, ఆర్డీవో మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి.

ప్రొటోకాల్‌ విధులు ఎక్కువగా ఆర్డీవోనే చూడాలి. అయితే ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్‌లలో ప్రొటోకాల్‌ విధులకు సంబంధించి చివరి నిమిషంలో తనకు సమాచారం ఇస్తున్నారని, పరుగుపరుగున వెళ్లేసరికి అతిథులు వెళ్లిపోతున్నారని...అందుకు తాను బాధ్యత వహించాల్సి వస్తోందని కార్యాలయ సిబ్బంది వద్ద ఆమె వాపోతున్నట్టు తెలిసింది. అయితే ఏ విషయంలోనూ ఆర్డీవో సీరియస్‌గా ఉండకపోవడంతో కొన్ని కార్యక్రమాలకు ఇతర అధికారులను నియమిస్తున్నారని వాదన ఉంది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల పేషీలకు ఆమె చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఆర్డీవో ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి హాజరుకావడం లేదు. గతంలో పనిచేసిన ఆర్డీవోలు ప్రతి సోమవారం ఈ కార్యక్రమానికి హాజరయ్యేవారు. హెడ్‌క్వార్టర్‌ ఆర్డీవో అనగానే కలెక్టర్‌కు చేదోడుగా ఉండాలి. అయితే శ్రీలేఖ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటున్నారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌లు మండలాల నుంచి సమాచారం కావాలనుకుంటే నేరుగా సంబంధిత తహశీల్దార్లతో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

అంబేడ్కర్‌ విగ్రహం వివాదంపై కలెక్టర్‌ షోకాజ్‌ ఇచ్చిన నేపథ్యంలో సమాచారం కోసం ఆర్డీవో కలెక్టరేట్‌లో ఒక అధికారికి రెండుసార్లు ఫోన్‌ చేస్తే లిఫ్ట్‌ చేయలేదని తెలిసింది. ఇదిలావుండగా పెందుర్తి, గాజువాక, సీతమ్మధార, పద్మనాభం తహశీల్దారు కార్యాలయాల సిబ్బంది ద్వారా డీఆర్వో ఇంటి సామగ్రి తెప్పించుకుంటున్నట్టు ఆర్డీవో ఇచ్చిన ఫిర్యాదుపై నిఘా వర్గాలు శుక్రవారం ఆరా తీశాయి. ఆయా తహశీల్దారు కార్యాలయాలకు వెళ్లి సిబ్బందిని వాకబు చేశాయి. ఇంకా కలెక్టరేట్‌లో పలు సెక్షన్‌లలో అధికారులు, సిబ్బంది నుంచి కూడా సమాచారం సేకరించారు. కాగా డీఆర్వోపై ఆర్డీవో ఫిర్యాదు నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ను జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి త్రినాథ్‌, శ్యాంసుందర్‌ కలిశారు. డీఆర్వో సరుకుల కోసం ఇండెంట్‌ పెడుతున్నట్టు ఆర్డీవో చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీవోపై ఫిర్యాదు చేశారు. ఈ వివాదం ఇంకా కొనసాగితే జిల్లాలో పాలన సజావుగా సాగదని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Updated Date - Oct 18 , 2025 | 01:10 AM