Share News

ఖాళీగానే డీఆర్వో, ఆర్డీవో పోస్టులు!

ABN , Publish Date - Nov 23 , 2025 | 01:01 AM

జిల్లా రెవెన్యూ అధికారి, విశాఖ ఆర్డీవో పోస్టులు దాదాపు నెల రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి.

ఖాళీగానే డీఆర్వో, ఆర్డీవో పోస్టులు!

ఆ పోస్టుల్లో ఉన్న

అధికారులు నెల రోజుల కిందట బదిలీ

ఇప్పటికీ ఎవరినీ నియమించని వైనం

కీలక పోస్టుల ఖాళీగా ఉండడంతో

జిల్లా యంతాంగంపై ఒత్తిడి

ఆర్డీవో పోస్టు కోసం పలువురి యత్నం

విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):

జిల్లా రెవెన్యూ అధికారి, విశాఖ ఆర్డీవో పోస్టులు దాదాపు నెల రోజుల నుంచి ఖాళీగా ఉన్నాయి. కార్యక్రమాలు, సదస్సులు, ప్రముఖుల పర్యటనలతో బిజీగా ఉండే విశాఖ జిల్లాలో ఈ రెండు పోస్టులు ఎంతో కీలకమైనవి. ఇద్దరు అధికారులూ లేకపోవడంతో ఇటీవల భాగస్వామ్య సదస్సు నిర్వహణ సమయంలో రెవెన్యూ సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.

జిల్లా రెవెన్యూ అధికారి భవానీశంకర్‌, ఆర్డీవో శ్రీలేఖ మధ్య వివాదం తలెత్తడంతో ఇద్దరినీ గత నెల 20వ తేదీన ప్రభుత్వం బదిలీ చేసింది. ఇరువురికి ఇంకా పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఇక్కడ డీఆర్వో, ఆర్డీవో పోస్టుల్లో ఎవరినీ నియమించలేదు. జాయింట్‌ కలెక్టర్‌ మయూర అశోక్‌కు డీఆర్వోగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అలాగే హెచ్‌పీసీఎల్‌ ఎస్డీసీ సుధాసాగర్‌ను ఇన్‌చార్జి ఆర్డీవోగా తాత్కాలికంగా నియమించారు. ఐఏఎస్‌ అధికారికి డీఆర్వో బాధ్యతలు అప్పగించారు.

నెల రోజులపాటు రెండు పోస్టులను ఖాళీగా ఉంచడం ఇప్పటివరకూ జరగలేదని కొందరు రిటైర్డు రెవెన్యూ ఉద్యోగులు చెబుతున్నారు. రాష్ట్రంలో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నానికి ప్రముఖుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు విశాఖలో జాతీయ, అంతర్జాతీయ సదస్సులు, ఇతర కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయి. ఆయా కార్యక్రమాలకు వచ్చే ప్రముఖులకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలకడం నుంచి స్థానికంగా పర్యటనలు, ఇతర ప్రొటోకాల్‌ బాధ్యతలు ఆర్డీవో చూస్తుంటారు. ప్రముఖులకు వాహనాలు, వసతి సౌకర్యం కల్పించడం, సదస్సు నిర్వహణకు ఏర్పాట్లు వంటివి కలెక్టర్‌/జేసీకి తోడుగా డీఆర్వో పర్యవేక్షిస్తారు. సదస్సుల నిర్వహణ, ప్రముఖులకు వసతి తదితర ఏర్పాట్ల కోసం కలెక్టరేట్‌ ఉద్యోగులు/సెక్షన్‌ సూపరింటెండెంట్లు ఎప్పటికప్పుడు డీఆర్వోతో చర్చిస్తారు. అనంతరం ఆయన కలెక్టర్‌/జేసీతో చర్చిస్తుంటారు. అయితే మొన్న భాగస్వామ్య సదస్సుకు సంబంధించి అనేక అంశాలపై ఇన్‌చార్జి డీఆర్వో బాధ్యతలు నిర్వర్తించిన జేసీతో నేరుగా చర్చించే సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జేసీ ఐఏఎస్‌ అధికారి కావడంతో డీఆర్వో వద్ద ఉన్న చనువు ఉండదు. ఏదైనా జేసీ సీసీ ద్వారా సమాచారం చేరవేయాల్సి ఉంటుంది.

భాగస్వామ్య సదస్సు సమయంలో కీలక అధికారులు లేని వెలితి కనిపించింది. ఈ విషయం జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించినా ఇంతవరకు కొత్తవారిని నియమించలేదు. డీఆర్వోగా సీనియర్‌ ఎస్డీసీలలో ఒకరిని నియమించినా కొంతవరకు ఉద్యోగులకు వెసులుబాటు కలుగుతుంది. ఇదిలావుండగా విశాఖ ఆర్డీవోగా రావడానికి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసిన సూర్యకళ యత్నించారని ప్రచారం సాగుతుంది. ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న వ్యక్తుల ద్వారా ఆమె ప్రయత్నించగా కొందరు ఏసీబీకి ఫిర్యాదు చేశారని రెవెన్యూ వర్గాల్లో చర్చ సాగుతుంది. చివరకు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో ఆమెను ఏసీబీ అరెస్టు చేసింది. మరో వివాదాస్పద అధికారి విశాఖ ఆర్డీవోగా రావడానికి యత్నిస్తున్నారని, కూటమి నేతలు కొందరు సిఫారసు చేశారని చెబుతున్నారు. ఎంతో కీలకమైన విశాఖ ఆర్డీవోగా మంచి ట్రాక్‌ రికార్డు ఉన్న అధికారిని నియమించాలని ఉద్యోగులు కోరుతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ, మిలాన్‌ జరగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఏర్పాట్లకు డీఆర్వో, ఆర్డీవో స్థాయి అధికారుల సేవలు అవసరం కావడంతో ప్రభుత్వం వెంటనే ఆ రెండు పోస్టులను భర్తీచేయాలని కోరుతున్నారు.

Updated Date - Nov 23 , 2025 | 01:01 AM