Share News

కేజీహెచ్‌లో తాగునీటి కష్టాలు!

ABN , Publish Date - May 15 , 2025 | 01:01 AM

ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌లో తాగునీటి కోసం రోగులు, వారి బంధువులు అల్లాడిపోతున్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లభ్యం కాకపోతుండడంతో రోగులు, వారి సహాయకులు బయట వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గత మూడు, నాలుగు వారాల నుంచి తాగునీటితో పాటు ఇతర అవసరాలకు సరిపడా నీరు లేకపోవడంతో అనేక వార్డుల్లో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో పలుచోట్ల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను కొళాయిలను ఏర్పాటు చేశారు.

కేజీహెచ్‌లో తాగునీటి కష్టాలు!

కొళాయిల నుంచి నీరు లభ్యం కాక బయట వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేసుకుంటున్న రోగుల సహాయకులు

వార్డుల్లో ఇతర అవసరాలకూ నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు

బాత్రూమ్‌లను శుభ్రం చేయకపోవడంతో దుర్వాసనను భరించలేకపోతున్నామంటున్న రోగులు

సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు పటిష్ఠ చేపట్టాలని రోగులు, సహాయకుల వేడుకోలు

విశాఖపట్నం, మే 14 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ప్రజల ఆరోగ్య ప్రదాయిని కేజీహెచ్‌లో తాగునీటి కోసం రోగులు, వారి బంధువులు అల్లాడిపోతున్నారు. తాగడానికి గుక్కెడు నీళ్లు లభ్యం కాకపోతుండడంతో రోగులు, వారి సహాయకులు బయట వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. గత మూడు, నాలుగు వారాల నుంచి తాగునీటితో పాటు ఇతర అవసరాలకు సరిపడా నీరు లేకపోవడంతో అనేక వార్డుల్లో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆస్పత్రిలో పలుచోట్ల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను కొళాయిలను ఏర్పాటు చేశారు. అయితే వాటి నుంచి నీరు రావడం లేదని రోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరోజు ఆయా కొళాయిల ద్వారా నీరొస్తే.. ఆ తరువాత రెండు, మూడు రోజుల వరకు రావడం లేదని, వచ్చిన రోజు కూడా రెండు, మూడు గంటలు మాత్రమే నీరు వస్తోందని వారు చెబుతున్నారు.

కేజీహెచ్‌ భావనగర్‌ వార్డు ఎదురుగా, పాత బ్లడ్‌ బ్యాంక్‌ వద్ద, క్యాజువాల్టీ ఆవరణలో ఉన్న కొళాయిల నుంచి అయితే అసలు నీరే రావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోగుల సహాయకులు తాగునీటి కోసం వాటర్‌ బాటిళ్లు పట్టుకుని అనేక వార్డులు తిరగాల్సి వస్తోంది. అన్నిచోట్లా ఇదే పరిస్థితి నెలకొనడంతో తాగునీటిని బయట కొనుగోలు చేసి దాహార్తిని తీర్చుకుంటున్నామని ఓ రోగి సహాయకురాలు రాధ తెలిపారు. కాగా ఆస్పత్రిలోని ఒక సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ వద్దనున్న కొళాయి నుంచి మాత్రమే నీళ్లు వస్తున్నాయి.

వార్డుల్లో తీవ్ర ఇబ్బందులు

తాగడానికే కాకుండా వార్డుల్లో ఇతర అవసరాలకు వినియోగించేందుకు కూడా నీరు లేకపోవడంతో రోగులతో పాటు నర్సింగ్‌ సిబ్బంది, ఇతర స్టాఫ్‌ నానాపాట్లు పడుతున్నారు. నీటి సరఫరా లేకపోవడంతో అనేక వార్డుల్లోని బాత్రూమ్‌ల నుంచి వస్తున్న దుర్వాసనను భరించలేకపోతున్నామని.. వార్డుల్లో ఉండలేకపోతున్నామని రోగులు వాపోతున్నారు. నీటి కొరతతో బాత్రూమ్‌లను శుభ్రం చేయడం లేదని, పరిస్థితులు ఇలాగే ఉంటే మరిన్ని వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని రోగుల సహాయకులు భయాందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కొందరు రోగుల సహాయకులు తీసుకువెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని చెబుతున్నారు. దీంతో బాత్రూమ్‌కు వెళ్లాలంటేనే భయమేస్తోందని, అక్కడ దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని రాజేంద్రప్రసాద్‌ వార్డులో చికిత్స పొందుతున్న రోగి సహాయకుడు నాయుడు తెలిపారు. ఆస్పత్రిలో తాగునీరు లభ్యం కాకపోవడంతో రెండు రోజుల నుంచి బయటే వాటర్‌ బాటిళ్లను కొనుగోలు చేస్తున్నామని, నీటి సమస్య వేసవిలో ఉత్పన్నమవుతుందని తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని డి.వెంకటరావు అనే రోగి సహాయకుడు పేర్కొన్నారు. కాగా కార్డియాలజీ విభాగం వద్దనున్న ఆర్వో ప్లాంట్‌ వద్ద నీరు రాకపోవడం మాట పక్కన పెడితే దానిని ముట్టుకుంటేనే కరెంట్‌ షాక్‌ కొడుతుందని పలువురు రోగుల సహాయకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఆస్పత్రి ఉన్నతాధికారులు స్పందించి నీటి ఇబ్బందులను తొలగించేందుకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని రోగులతో పాటు వారి సహాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు.

సరఫరా ఏదీ?

కేజీహెచ్‌లోని వార్డులు, నర్సింగ్‌ కాలేజీ, హాస్టళ్లతో పాటు అధికారుల చాంబర్స్‌కు అవసరమయ్యే నీటిని జీవీఎంసీ సరఫరా చేస్తుంది. రోజువారీ అవసరాల కోసం కేజీహెచ్‌కు 500 నుంచి 600 కిలోలీటర్ల నీరు అవసరం అవుతుంది. ఈ నీటి సరఫరా కోసం కేజీహెచ్‌లో ఐదుచోట్ల నీటిని నిల్వ చేసే సంపులు ఉన్నాయి. ఈ సంపులకు రెండు మార్గాల ద్వారా జీవీఎంసీ నీటిని సరఫరా చేస్తుంది. ఈ మేరకు నీటిని సరఫరా చేయకపోవడం వల్లే సమస్యలు ఎదురవుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు.

Updated Date - May 15 , 2025 | 01:01 AM