డబుల్ డెక్కర్ మెట్రో రైలు
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:55 AM
విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అడుగుపడింది.
దాంతో పాటు నాలుగు వరుసల ఫైఓవర్లు
డీపీఆర్ తయారీ బాధ్యత బార్సిల్ కంపెనీకి అప్పగింత
రూ.47.17 లక్షలు కేటాయింపు
ఎక్కువ స్థలం అవసరమవుతుందంటున్న అధికార వర్గాలు
విశాఖపట్నం, జూన్ 2 (ఆంధ్రజ్యోతి):
విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన అడుగుపడింది. ఇంతవరకూ దీనికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారుకాలేదు. గతంలో నిర్ణయించిన ప్రకారం కాకుండా కొత్తగా ఈ ప్రభుత్వం ఆలోచన చేయడంతో దానికి తగ్గట్టు డీపీఆర్ రూపొందించాల్సి వచ్చింది. ఈ బాధ్యతను సికింద్రాబాద్‌కు చెందిన బార్సిల్ కంపెనీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. విశాఖ నగర ప్రజలకు ఉన్న అనుమానాలకు ఈ నిర్ణయం ద్వారా కొంత స్పష్టత వచ్చింది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టులో డబుల్ డెక్కర్ రైలుతో పాటు నాలుగు వరుసల ఫ్లైఓవర్ల నిర్మాణానికి అనువుగా డీపీఆర్ తయారుచేయాలని ప్రభుత్వం బార్సిల్ సంస్థను ఆదేశించింది.
విశాఖపట్నంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. నగరంలో సుమారు 11 ఫ్లైఓవర్ల నిర్మాణానికి జాతీయ రహదారుల సంస్థ ఇంతకు ముందే డీపీఆర్ తయారుచేసి కేంద్రం నుంచి అనుమతి తీసుకుంది. అయితే నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నందున ఫ్లైఓవర్లు నిర్మిస్తే అనుసంధానం చేయడం కష్టమవుతుందని, అందువల్ల రెండింటినీ సమన్వయం చేస్తూ డిజైన్ తయారుచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే జూన్ నాటికి పూర్తవుతుందని భావిస్తున్న నేపథ్యంలో విశాఖ నుంచి అక్కడకు వెళ్లడానికి అనువుగా ట్రాఫిక్‌ను సరిదిద్దాల్సి ఉంది. ఇందుకు ఫ్లైఓవర్లు చాలా అవసరం. అయితే ముందు వాటిని కాకుండా బీచ్‌రోడ్డును, జాతీయ రహదారిని కనెక్ట్ చేస్తూ వీఎంఆర్‌డీఏ ద్వారా మాస్టర్ ప్లాన్ రహదారులు అభివృద్ధి చేస్తున్నారు. అవి అందుబాటులోకి వచ్చినా సరే ఫ్లైఓవర్ల అవసరం ఉందని జిల్లా నాయకులు ఇటీవల గట్టిగా కోరిన నేపథ్యంలో ప్రభుత్వం మెట్రోతో పాటే నాలుగు వరుసల ఫ్లైఓవర్లు నిర్మాణానికి డిజైన్ రూపొందించాల్సిందిగా కోరడం గమనార్హం. అయితే సిటీ మధ్యలో స్తంభాలు వేసి మెట్రో రైలు నడపడం వరకు బాగానే ఉంటుంది కానీ అదే స్తంభాలపై నాలుగు వరుసల ఫ్లైఓవర్లు నిర్మించాలంటే ఎక్కువ స్థలం అవసరమవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ డీపీఆర్‌కు ప్రభుత్వం రూ.47.17 లక్షల బడ్జెట్ కేటాయించింది.
మెట్రో రైలు మొదటి దశలో మూడు కారిడార్లకు కలిపి మొత్తం 46.23 కి.మీ. పొడవున ట్రాక్ వేయాలని ఇంతకుముందు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ నిర్ణయించింది. మలి దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకూ నాలుగో కారిడార్ నిర్మిస్తారు. తొలి దశ పనులకు రూ.11,498 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం 99.8 ఎకరాలు అవసరం కాగా భూసేకరణకు సుమారు రూ.882 కోట్లు నిధులు కావాలని అంచనా వేశారు.