Share News

భీమిలి బీచ్‌ రోడ్డులో డబుల్‌ డెక్కర్‌ బస్సులు

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:03 AM

విశాఖపట్నంలో పర్యాటక రంగానికి కొత్త రంగులు అద్దడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది. బీచ్‌ రోడ్డులో ‘హాప్‌ ఆన్‌,హాప్‌ ఆఫ్‌’ బస్సులు నడిపితే బాగుంటుందని ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ప్రతినిధులు చాలాకాలంగా సూచిస్తున్నారు. దీనిపై ప్రస్తుత కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ దృష్టిపెట్టారు.

భీమిలి బీచ్‌ రోడ్డులో డబుల్‌ డెక్కర్‌ బస్సులు
: హాప్‌ ఆన్‌ హాప్‌ ఆఫ్‌ బస్సు.

కింద క్లోజ్డ్‌ డోర్స్‌, పైన ఓపెన్‌ టాప్‌...

వారం రోజుల్లో రాక

నిర్వహణకు ప్రాజెక్టు మానటరింగ్‌

యూనిట్‌ ఏర్పాటు

పర్యాటకానికి కొత్త హంగులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నంలో పర్యాటక రంగానికి కొత్త రంగులు అద్దడానికి జిల్లా యంత్రాంగం ప్రయత్నం చేస్తోంది. బీచ్‌ రోడ్డులో ‘హాప్‌ ఆన్‌,హాప్‌ ఆఫ్‌’ బస్సులు నడిపితే బాగుంటుందని ఏపీ టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ ప్రతినిధులు చాలాకాలంగా సూచిస్తున్నారు. దీనిపై ప్రస్తుత కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ దృష్టిపెట్టారు. విశాఖపట్నం పోర్టుతో సంప్రతింపులు జరిపి పర్యావరణ సామాజిక బాధ్యత కింద రెండు ఎలక్ర్టిక్‌ బస్సులు ఇవ్వాలని కోరగా, పోర్టు యాజమాన్యం అంగీకరించింది. ఇవి డబుల్‌ డెక్కర్‌ బస్సులు. పూర్తి ఏసీ కలిగి ఉంటాయి. కింద క్లోజ్డ్‌ డోర్స్‌తో, పైన ఓపెన్‌ టాప్‌తో ఉంటాయి. వీటి ఖరీదు ఒక్కొక్కటి సుమారు రూ.1.8 కోట్లు. వీటితో పాటు అశోక్‌ లేల్యాండ్‌ నుంచి ఒక ఏసీ బస్సు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ కొన్ని ఏసీ బస్సులు ఇవ్వడానికి ముందుకు రాగా అందులో ఒకటి విశాఖపట్నం పంపుతామని అమరావతి అధికారులు తెలిపారు. దీంతో కలుపుకొని మొత్తం మూడు బస్సులు పర్యాటక శాఖకు అందనున్నాయి. వీటిని బీచ్‌ రోడ్డులో ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి భీమిలి వరకూ నడుపుతారు. రూట్లు, స్టాపులు, అవసరమైన అనుమతులపై రవాణా శాఖ, ఆర్టీసీ అధికారులతో చర్చించాలని కలెక్టర్‌ సూచించారు. వీటి నిర్వహణకు ప్రాజెక్టు మానటరింగ్‌ యూనిట్‌ (పీఎంయు) ఏర్పాటు చేస్తారని సమాచారం. వాల్తేరులోని ఆర్టీసీ డిపోలో ఈ బస్సులకు అవసరమైన చార్జింగ్‌ పాయింట్లు కేటాయించాలని రీజనల్‌ మేనేజర్‌కు సూచించారు. ఈ బస్సులు చూడడానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి.

వాస్తవానికి ప్రస్తుతం బీచ్‌ రోడ్డులో బస్సులు ఏవీ లేవు. భీమిలి వెళ్లే ఒక బస్సు ఎంవీపీ కాలనీ మీదుగా అప్పుఘర్‌ చేరి, అక్కడి నుంచి రుషికొండ మీదుగా వెళుతుంది. ఇది కాలేజీ సమయాల్లో పూర్తిగా కిక్కిరిసి ఉంటుంది. పర్యాటకులు ఆర్‌కే బీచ్‌ నుంచి గానీ, ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి గానీ రుషికొండ, భీమిలి వెళ్లాలంటే బస్సు సౌకర్యం లేదు. ఇప్పుడు అందమైన బస్సులు అందుబాటులోకి వస్తే బీచ్‌ టూరిజం పెరుగుతుందని, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో డిమాండ్‌ బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. వీటికి ఆదరణ బాగుంటే మరిన్ని బస్సులు నడిపే ప్రయత్నం చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఈ బస్సులు వారం రోజుల్లో విశాఖపట్నం వచ్చే అవకాశం ఉంది.

Updated Date - Apr 10 , 2025 | 01:03 AM