స్త్రీశక్తికి రెట్టింపు ఆదరణ
ABN , Publish Date - Sep 07 , 2025 | 10:47 PM
మన్యంలో స్త్రీశక్తి పథకానికి రెట్టింపు ఆదరణ లభిస్తున్నది. మైదాన ప్రాంతం కంటే గిరిజన ప్రాంతంలోని మహిళలకే ఈ పథకం ద్వారా అధిక లబ్ధి చేకూరుతున్నదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే గిరిజన మహిళలు సైతం ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయింది.
గతంలో రోజూ 3 వేల మంది మహిళా ప్రయాణికులు
ఇప్పుడు 6 వేలకు చేరిన వైనం
ఏజెన్సీలోనూ ఉచిత బస్సు ప్రయాణానికి విశేష స్పందన
గత నెల 15 నుంచి 31 వరకు మొత్తం 1,95,315 మంది ప్రయాణికుల్లో 80,613 మంది మహిళలే..
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
మన్యంలో స్త్రీశక్తి పథకానికి రెట్టింపు ఆదరణ లభిస్తున్నది. మైదాన ప్రాంతం కంటే గిరిజన ప్రాంతంలోని మహిళలకే ఈ పథకం ద్వారా అధిక లబ్ధి చేకూరుతున్నదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే గిరిజన మహిళలు సైతం ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో రోజువారీ మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు అయింది.
ఏజెన్సీలో గతంలో రోజూ 8 నుంచి 10 వేల మంది ప్రయాణించే వారు. వీరిలో 3 వేల మంది మహిళలుండేవారు. స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించిన తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పురుష ప్రయాణికుల సంఖ్య ఎప్పటిలాగానే ఉండగా, మహిళల సంఖ్య మాత్రం రెట్టింపు అయింది. ఏజెన్సీలో పురుషుల కంటే మహిళలే అన్ని వ్యవహారాల్లో చురుగ్గా ఉంటారు. ఆఖరుకు వారపు సంతల్లో చిరు వ్యాపారాలు సైతం అధిక సంఖ్యలో మహిళలే చేస్తుంటారు. ఈ క్రమంలో ఏజెన్సీలో గిరిజన మహిళల రాకపోకలకు ఉచిత ప్రయాణం చాలా వరకు ఉపయోగపడుతున్నది. దీంతో గతంలో జీపులు, ఆటోల్లో వారపు సంతలకు వెళ్లే మహిళలు గత నెల 16 నుంచి ఆర్టీసీ బస్సుల్లోనే వెళుతున్నారు.
ఆర్టీసీ డిపోలకు అదన పు బస్సులు అవసరం
జిల్లాలో స్త్రీశక్తి పథకానికి రెట్టింపు ఆదరణ లభిస్తుండడంతో బస్సులు సైతం పెంచాల్సిన అవసరం ఉందని తెలుస్తున్నది. ప్రస్తుతం వివిధ డిపోలకు చెందిన 110 వరకు బస్సులు తిరుగుతుండగా, మరో 20 నుంచి 25 బస్సులు అదనంగా అవసరమని అధికారులు భావించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఉదాహరణకు పాడేరులో మొత్తం 45 బస్సులుండగా, ప్రస్తుతానికి 43 బస్సులు ఏజెన్సీతో పాటు విశాఖపట్నం, చోడవరం, విజయనగరం, రాజమహేంద్రవరం, కాకినాడ ప్రాంతాలకు నడుస్తున్నాయి. వాటిలో 30 పల్లెవెలుగు, 12 ఎక్స్‌ప్రెస్, 3 ఆల్ర్టా డీలక్స్ బస్సులు ఉన్నాయి. అయితే మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో కేవలం పాడేరు డిపోనకే అదనంగా 12 బస్సులు అవసరమని అధికారులు భావిస్తున్నారు. స్ర్తీశక్తి పథకం అమల్లోకి వచ్చిన తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య రెట్టింపు కావడంతో అదనపు బస్సులు అనివార్యమని ప్రయాణికులు అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం అదనపు బస్సులను సమకూర్చాలని మహిళలు కోరుతున్నారు.
ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు పాడేరు ఆర్టీసీ డిపో పరిధిలో ప్రయాణికుల వివరాలు
తేదీ పురుషులు మహిళలు మొత్తం ప్రయాణికులు
1 6,666 6544 13,210
2 6202 6399 12,601
3 6799 6591 13,390
4 5907 6236 12,143
-----------------------------------------------------------------------
మొత్తం 25,574 25,770 51,344
-----------------------------------------------------------------------