కాఫీ రైతుకు డబుల్ బొనాంజా
ABN , Publish Date - Mar 12 , 2025 | 11:34 PM
కాఫీ రైతులకు ఈ ఏడాది కలిసొచ్చింది. కాఫీ తోటల్లో అంతర పంటగా ఉన్న మిరియాలకు కూడా మంచి ధర లభిస్తుండడంతో డబుల్ బొనాంజా లభించినట్టయింది. కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి రేటు పలుకుతుండగా, బుధవారం మార్కెట్లో మిరియాలు కిలో ధర రూ.600 పలికింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కాఫీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కాఫీతో పాటు మిరియాలకు మంచి ధర పలుకుతుండడంతో ఖుషీ
కాఫీ తోటల్లో అంతర పంటగా ఉన్న మిరియాల సేకరణలో బిజీ
జోరుగా సాగుతున్న మిరియాల అమ్మకాలు
అరకులోయ, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కాఫీ రైతులకు ఈ ఏడాది కలిసొచ్చింది. కాఫీ తోటల్లో అంతర పంటగా ఉన్న మిరియాలకు కూడా మంచి ధర లభిస్తుండడంతో డబుల్ బొనాంజా లభించినట్టయింది. కాఫీకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి రేటు పలుకుతుండగా, బుధవారం మార్కెట్లో మిరియాలు కిలో ధర రూ.600 పలికింది. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో కాఫీ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలో 6,930 ఎకరాల్లోని కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాలను సాగు చేస్తున్నారు. అలాగే కాఫీ మొక్కలకు నీడనిచ్చేందుకు వేసిన సిల్వర్‌ఓక్ వృక్షాల(దేవదారు)కు కూడా మిరియాల పాదులను అల్లారు. ఇప్పుడు మిరియాల పంట పుష్కలంగా రావడంతో పచ్చి గింజలను ఏరే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. ఐటీడీఏ పంపిణీ చేసిన పొడవాటి అల్యూమినియం నిచ్చెనల సహాయంతో మిరియాలను సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన పచ్చి మిరియాలను ఇంటి వద్ద పరదాలపై ఎండలో ఆరబోసే పనిలో మహిళలు బిజీగా ఉన్నారు. బాగా ఎండిన మిరియాలు నల్లని రంగులోకి రాగానే వ్యాపారులకు విక్రయిస్తున్నారు.
జోరుగా అమ్మకాలు
సుంకరమెట్ట ప్రాంతానికి చెందిన వ్యాపారులు రైతులను మిరియాలను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది పెద్ద ఎత్తున పంట దిగుబడి రావడంతో గింజ సైజు కాస్త తగ్గిందని, అయినా మార్కెట్‌లో మంచి రేటు లభిస్తున్నదని వ్యాపారులు చెప్పారు. బుధవారం మిరియాలు కిలో ధర రూ.600 పలకడంతో రైతులు ఖుషీగా ఉన్నారు. వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేసిన మిరియాలను 50 కిలోల బస్తాల కింద ప్యాకింగ్ చేసి కర్ణాటకకు రవాణా చేస్తున్నారు. అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లో ఈ ఏడాది సుమారు 500 టన్నుల మిరియాలు దిగుబడి వచ్చిందని అంచనా వేస్తున్నారు.