Share News

జీఎస్టీ 2.0పై ఇంటింటా ప్రచారం

ABN , Publish Date - Sep 29 , 2025 | 12:42 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి.

జీఎస్టీ 2.0పై ఇంటింటా ప్రచారం

సంస్కరణల ఫలితాలను ప్రజలకు తెలియజేసే బాధ్యత ఆరోగ్యశాఖకు

నాలుగు వారాల పాటు అవగాహన కార్యక్రమాల నిర్వహణ

ఆరోగ్యశాఖ అధికారుల నుంచి ఏఎన్‌ఎం వరకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాల్సిందే

ఫొటోలను గ్రూపుల్లో షేర్‌ చేయాలని సూచించిన డీఎంహెచ్‌వో డాక్టర్‌ జగదీశ్వరరావు

విశాఖపట్నం, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలు, నూతన మార్పులను ప్రజలకు తెలియజేసేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతను వివిధ ప్రభుత్వ శాఖలకు అప్పగించాయి. ఈ క్రమంలో జిల్లాలో జీఎస్టీ 2.0 సంస్కరణలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆరోగ్యశాఖ సన్నద్ధమైంది. ఆదివారం నుంచి ఇంటింటికీ వెళ్లి జీఎస్టీ సంస్కరణలు, ప్రయోజనాలను తెలియజేయాలంటూ ఆరోగ్యశాఖకు ఆదేశాలు అందాయి. ఇందులో భాగంగానే జిల్లా అంతటా ఇంటింటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలంటూ జిల్లా ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నాలుగు వారాలపాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. నూతన సంస్కరణలకు ముందు జీఎస్టీ శ్లాబులు నాలుగు ఉన్నాయి. 5, 12, 18, 28 శాతం శ్లాబుల్లో పన్నులను వసూలు చేసేవారు. ఈ నెల 22 నుంచి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2.0 పేరుతో సంస్కరణలు చేపట్టింది. నూతన సంస్కరణలతో 5, 18 శాతం శ్లాబుల్లోనే పన్నులను వసూలు చేస్తున్నారు. ఇప్పటివరకు 5, 12 శాతం శ్లాబుల్లో ఉన్న అనేక రకాల వస్తువులు, నిత్యావసర సరకులపై పూర్తిగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తొలగించింది. దీనివల్ల సాధారణ, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుంది. ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలకు తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి.

ఇంటింటికీ వెళ్లి ప్రచారం

జీఎస్టీ నూతన సంస్కరణలకు ముందు ఉన్న శ్లాబులు, నూతన విధానం తరువాత వచ్చిన శ్లాబులు, పూర్తిగా పన్నులు తొలగించిన వస్తువులపై ప్రజలకు ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆరోగ్యశాఖ సిబ్బంది స్వస్థ్‌ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ పేరుతో ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఆయా శిబిరాలకు వచ్చే మహిళలు, ఇతరులకు నూతన సంస్కరణల గురించి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే పీహెచ్‌సీ, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో పనిచేసే వైద్యులు, ఏఎన్‌ఎంలు, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు, ఆశ వర్కర్లు, హెడ్‌ క్వార్టర్‌ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు నూతన సంస్కరణల గురించి తెలియజేయాల్సి ఉంటుంది. ఆయా ఇళ్లకు వెళ్లి ప్రజలకు వివరిస్తున్న ఫొటోలను సంబంధిత గ్రూపులో షేర్‌ చేయాలని డీఎంహెచ్‌వో స్పష్టం చేశారు.

వీటిపై ప్రత్యేకంగా..

నూతన సంస్కరణల వల్ల ప్రధానంగా ఆరోగ్య రంగానికి చెందిన వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీ భారం తగ్గిన తీరును ప్రజలకు పూర్తి స్థాయిలో సిబ్బంది వివరించాల్సి ఉంటుంది. 12 శాతం జీఎస్టీ నుంచి ఐదు శాతానికి, ఐదు శాతం నుంచి జీరోకు తగ్గించిన ఔషధాల గురించి తెలియజేస్తారు. అలాగే కంటిచూపును సరిచేసే వస్తువులపై జీఎస్టీ భారాన్ని 12 శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు. దీనివల్ల విద్యార్థులు, వృద్ధులకు కలిగే మేలును వివరించనున్నారు. చిన్నారులు, నవజాత శిశువులకు సంబంధించిన ఉత్పత్తులైన నాప్కిన్లు, లైనర్లు, ఫీడింగ్‌ బాటిళ్లపై జీఎస్టీ గతంలో 12 శాతం ఉండగా, ప్రస్తుతం ఐదు శాతానికి తగ్గించారు. అదేవిధంగా ఽథర్మామీటర్‌పై ఇప్పటివరకు 18 శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి, యూహెచ్‌టీ పాలపై ఐదు శాతం ఉన్న జీఎస్టీని సున్నాకు తగ్గించారు. వ్యక్తిగత ఆరోగ్య భీమాపై 18 శాతం ఉన్న జీఎస్టీని సున్నాకు తగ్గించడం వల్ల కలిగే లభ్ధిని ప్రజలకు తెలియజేయనున్నారు. అదే సమయంలో క్యాన్సర్‌కు కారణంగా ఉన్న తంబాకు, ఇతర ఉత్పత్తులపై జీఎస్టీని 28 శాతం నుంచి 40 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఈ అలవాట్లు ఉన్న ప్రజలకు ఇకపై పెరగనున్న ఆర్థిక భారాన్ని వివరించి వాటికి దూరంగా ఉండేలా అవగాహన కల్పించనున్నారు. దీనిపై ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పి.జగదీశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు నూతన సంస్కరణల వల్ల కలిగే ప్రయోజనాలను, లబ్ధిని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఇంటింట ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు.

Updated Date - Sep 29 , 2025 | 12:42 AM