ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:31 AM
ఉపాధి హామీ పథకం పేరును మార్చి, దీనిని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వామపక్ష నాయకులు ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులను వ్యతిరేకిస్తూ సోమవారం నెహ్రూచౌక్‌లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు.
వామపక్షాల డిమాండ్, అనకాపల్లిలో ధర్నా
అనకాపల్లి టౌన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం పేరును మార్చి, దీనిని నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని వామపక్ష నాయకులు ఆరోపించారు. ఉపాధి హామీ పథకంలో మార్పులను వ్యతిరేకిస్తూ సోమవారం నెహ్రూచౌక్‌లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్.దొరబాబు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యుడు ఆర్.శంకరరావు మాట్లాడుతూ, వ్యవసాయ కూలీల వలసలను నివారించడానికి రెండు దశాబ్దాల క్రితం వామపక్షాల పోరాటం ఫలితంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటి వరకు వ్యవసాయ కార్మికుల అవసరాన్నిబట్టి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించే వారని, కేంద్ర ప్రభుత్వం పేరుతోపాటు విధి విధానాలను మార్చివేయడంతో కూలీలకు పూర్తిస్థాయిలో పనులు లభించవని అన్నారు. పని దినాలను వంద నుంచి 125 రోజులకు పెంచనున్నట్టు చెప్పడం కూలీలను మభ్యపెట్టేందుకేనని విమర్శించారు. మోదీ ప్రభుత్వానికి కీలక మద్దతుగా ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు కొత్త ఉపాధి బిల్లును ఉపసంహరించుకునేటట్టు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వి.వి.శ్రీనివాసరావు, అల్లు రాజు, గండి నాయనబాబు, కర్రి అప్పారావు, వైఎన్ భద్రం, కె.శంకర్రావు, ఫణేంద్ర, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.