ఈ ఫోన్లు మాకొద్దు!
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:32 AM
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి అందించిన ఫోన్లను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.
తిరిగి అప్పగించాలని అంగన్‌వాడీ కార్యకర్తల నిర్ణయం
నేడు సీడీపీవో కార్యాలయాల్లో అందజేతకు సన్నాహాలు
యాప్‌ల భారం ఎక్కువవుతోందని ఆందోళన
ఇబ్బందులను పట్టించుకోవడం లేదని ఆవేదన
అదనపు భారం మోపడంపై ఆగ్రహం
విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):
ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల సిబ్బందికి అందించిన ఫోన్లను వెనక్కి ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు. కేంద్రాల ద్వారా అమలుచేసే పథకాలు, లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు 2018లో అప్పటి ప్రభుత్వం ఈ ఫోన్లను అందించింది. ప్రభుత్వం సూచించిన పోషణట్రాకర్, బాల సంజీవని యాప్‌ల్లో కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు అందించే రేషన్, ఇతర వివరాలను అప్‌లోడ్ చేయాలని సూచించింది. అయితే కొన్నాళ్లుగా ఫోన్లు సరిగా పనిచేయడం లేదని, యాప్‌ల భారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది వాపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం కనిపించలేదంటున్నారు.
గతంలో లబ్ధిదారుల కుటుంబసభ్యుల్లో ఎవరు వచ్చినా రేషన్ ఇచ్చే పరిస్థితి ఉండేదని, ఫొటో తీసి అప్‌లోడ్ చేసే అవకాశం ఇచ్చారని, ఇప్పుడు లబ్ధిదారుకు మాత్రమే పరిమితం చేశారని వాపోతున్నారు. ప్రసవం తరువాత కొంతమంది రాలేని పరిస్థితి ఉందని, దీంతో వారి ఇళ్లకు వెళ్లి రేషన్ ఇవ్వాల్సి వస్తోందంటున్నారు. దీంతో ఒక్కో లబ్ధిదారుకు కనీసం 20 నిమిషాలు వెచ్చించాల్సి రావడంతో కేంద్రాల నిర్వహణపై దృష్టి సారించలేకపోతున్నామంటున్నారు. ఈ ఇబ్బందుల ను పరిష్కరించేందుకు కొత్త ఫోన్లు ఇవ్వాలని కోరినా అధికారులు స్పందించడం లేదంటున్నారు.
అదనపు భారంపై ఆగ్రహం
ఆరోగ్య శాఖ పరిధిలో ఉన్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన పథకం అమలు బాధ్యతను అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ పథకాన్ని అమలు చేయలేమని, మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జిల్లాలోని కార్యకర్తలు తమ పరిధిలోని సీడీపీవో కార్యాలయాలకు వెళ్లి స్మార్ట్‌ఫోన్లను వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించారు. గతంలో మాదిరిగా కేంద్రాలకు సంబంధించిన వ్యవహారాలను రిజిస్టర్‌లో రాస్తామని, కొత్త ఫోన్లు ఇచ్చే వరకు ఆఫ్‌లైన్‌లోనే వివరాలు నమోదు చేస్తామంటున్నారు. జిల్లాలో 776 అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం స్మార్ట్‌ఫోన్లను అందించింది.
ఇవీ డిమాండ్లు..
ప్రస్తుతం ఉన్న యాప్‌లన్నింటినీ కలిపి ఒకే యాప్ తీసుకురావాలని, ఎఫ్‌ఆర్‌ఎస్ ఇన్, ఔట్ రద్దుచేయాలని, కేంద్రాల నిర్వహణకు 5జీ నెట్‌వర్క్‌తో కొత్త ట్యాబ్‌లు ఇవ్వాలని కోరుతున్నారు. వేతనాలు పెంచాలని, మినీల్లో పనిచేసేవారిని మెయిన్ వర్కర్లుగా మార్చుతూ జీవో విడుదల చేయాలని, గ్రాట్యూటీ జీవోలో మార్పులుచేయాలని, హెల్పర్ల ప్రమోషన్లకు గైడ్‌లైన్స్ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం అధికారులకు వినతిపత్రాలు అందించాలని నిర్ణయించారు.