Share News

శిశు మరణాలపై స్పందించరా?

ABN , Publish Date - Nov 18 , 2025 | 11:33 PM

మండలంలోని దారెల పంచాయతీలో వరుస శిశు మరణాలు సంభవిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు స్పందించడం లేదని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శిశు మరణాలపై స్పందించరా?
డి.కుమ్మరిపుట్టులో బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, పక్కన ఎమ్మెల్యే మత్స్యలింగం, మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

తప్పుడు లెక్కలు చెబుతున్నారని డీఎంహెచ్‌వోపై జడ్పీ చైర్‌పర్సన్‌ ఆగ్రహం

మరణాలకు గల కారణాలపై అధ్యయనం చేయాలని సూచన

ముంచంగిపుట్టు, నవంబరు 18, ( ఆంధ్రజ్యోతి): మండలంలోని దారెల పంచాయతీలో వరుస శిశు మరణాలు సంభవిస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు స్పందించడం లేదని జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పంచాయతీ పరిధిలో నెల రోజుల వ్యవధిలో ఐదుగురు శిశువులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై పలు పత్రికల్లో వస్తున్న వరుస కథనాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ స్పందించారు. ఆమెతో పాటు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మంగళవారం డి.కుమ్మరిపుట్టు గ్రామాన్ని సందర్శించారు. లలితశ్రీ అనే చిన్నారిని కోల్పోయిన తల్లిదండ్రులు కామరాజు, ఈశ్వరిలతో జడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడారు. ఆస్పత్రుల్లో ఎటువంటి వైద్య సేవలు అందించారనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అదే గ్రామానికి చెందిన నాలుగు నెలల బాబు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. స్థానిక వైద్య సిబ్బందితో మాట్లాడి శిశువుల వరుస మరణాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ఎప్పటికప్పుడు వైద్యులు, వైద్య సిబ్బంది పర్యటించాలని, ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని వారికి సూచించారు.

డీఎంహెచ్‌వోపై సీరియస్‌

దారెల పంచాయతీ పరిధిలో వరుస శిశు మరణాలు జరుగుతుంటే మీరు ఎందుకు స్పందించడం లేదని, శిశు మరణాలపై ఎందుకు తప్పుడు లెక్కలను చెబుతున్నారని డీఎంహెచ్‌వో డాక్టర్‌ కృష్ణమూర్తి నాయక్‌పై జడ్పీ చైర్‌పర్సన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు మృతి చెందితే కేవలం ముగ్గురు మాత్రమే మృతి చెందారని ఎలా అంటున్నారని నిలదీశారు. శిశు మరణాలు ఎందుకు జరుగుతున్నాయే క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేయాలని సూచించారు. దారెల పంచాయతీలో ఐదుగురు శిశువులు మృతి చెందినా ఆయా గ్రామాలను కలెక్టర్‌, ఐటీడీఏ పీవో సందర్శించకపోవడం విచారకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.ధర్మారావు, వైద్యాధికారి శ్యాంప్రసాద్‌, సీహెచ్‌వో సౌడప్పడు, వైస్‌ ఎంపీపీ ఎస్‌.భాగ్యవతి, సర్పంచ్‌ వి.రమేశ్‌, ఎంపీటీసీ ఎం.సుబ్బలక్ష్మి, వైసీసీ మండల అధ్యక్షుడు పి.పద్మారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 18 , 2025 | 11:33 PM