Share News

ఆశ్రమ విద్యార్థుల ఆరోగ్యంపై అలక్ష్యం వద్దు

ABN , Publish Date - Oct 22 , 2025 | 11:19 PM

గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు.

ఆశ్రమ విద్యార్థుల ఆరోగ్యంపై అలక్ష్యం వద్దు
మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో శ్రీపూజ, పక్కన, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, టీడబ్ల్యూ డీడీ పరిమిళ

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలకు ఐటీడీఏ పీవో హెచ్చరిక

పాడేరు, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లోని గిరిజన విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ హెచ్చరించారు. గిరిజన విద్యార్థ్థుల ఆరోగ్యంపై ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థుల ఆరోగ్యం, హాజరుపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలన్నారు. విద్యార్థులకు అనారోగ్య, ఇతర సమస్యలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో దాచిపెట్టవద్దని, అధికారులకు సమాచారం అందించి వెంటనే ఆస్పత్రుల్లో చేర్పించాలన్నారు. విద్యతో పాటు వారి ఆరోగ్య భద్రత ముఖ్యమనే విషయాన్ని గుర్తించాలన్నారు. దసరా సెలవుల అనంతరం విద్యార్థులకు ఆరోగ్య పరీక్షల ప్రక్రియను వేగవంతం చేయాలని, ప్రతి విద్యార్థికి హెల్త్‌ కార్డును నిర్వహించాలన్నారు. పలు అనారోగ్య సమస్యల దృష్ట్యా కేజీహెచ్‌ వంటి పెద్దాస్పత్రులకు విద్యార్థులను తరలిస్తే విధిగా టీచర్‌ తోడుగా ఉండాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులు అనారోగ్యంతో ఉన్నా, ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినా ఇంటికి మాత్రం పంపవద్దని, టీచర్ల పర్యవేక్షణలోనే ఉంచాలన్నారు. విద్యాలయాలు, వంటశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, తాగునీటి వనరులను క్లోరినేషన్‌ చేయాలని, వాటిపై అధికారుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఆశ్రమ పాఠశాలలకు తల్లిదండ్రులు విద్యార్థులను తీసుకు వచ్చినప్పుడు, ఇంటికి తీసుకువెళ్లినప్పుడు విధిగా మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు వ్యక్తిగత శ్రద్ధకనబరుస్తూ ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సాహిత్‌, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పీబీకే పరిమిళ, ఏజెన్సీ 11 మండలాలకు చెందిన ఏటీడబ్ల్యూవోలు, ఆశ్రమ పాఠఽశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 11:19 PM