Share News

సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వద్దు

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:20 AM

‘మొంథా’ తుఫాన్‌ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో అశ్రద్ధ చేయవద్దని జిల్లా ప్రత్యేకాధికారి, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు.

సహాయక చర్యల్లో నిర్లక్ష్యం వద్దు

తుఫాన్‌ తీవ్రత అధికంగా ఉండొచ్చు

ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించండి

విద్యా సంస్థల భవనాల్లో తాత్కాలిక షెల్టర్లు

ఆహారం, నీరు, మందులు సిద్ధంగా ఉంచాలి

అధికారులకు జిల్లా ప్రత్యేక అధికారి వినయ్‌చంద్‌ ఆదేశం

అనకాపల్లి, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):

‘మొంథా’ తుఫాన్‌ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో అశ్రద్ధ చేయవద్దని జిల్లా ప్రత్యేకాధికారి, ఆర్థిక శాఖ కార్యదర్శి వినయ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హాతో కలిసి కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తుఫాన్‌ ముందస్తు చర్యలపై వారిలో చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వినయ్‌చంద్‌ మాట్లాడుతూ, సహాయక చర్యలు అందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, సముద్ర తీర గ్రామాలు, నదుల పక్కన వున్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. జిల్లాలో గుర్తించిన 125 లోతట్టు గ్రామాలను మ్యాపింగ్‌ చేసి, సచివాలయ సిబ్బందిని నియమించాలన్నారు. సమీపంలోని విద్యా సంస్థల భవనాలను తుఫాన్‌ షెల్టర్లుగా వినియోగించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసిస్తున్న వారిని అత్యవసరంగా సురక్షిత ప్రదేశానికి తరలించాలన్నారు. తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఆహారం, నీరు, మందులు సిద్ధంగా ఉంచాలని, విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో ‘డెలివరీ డేట్‌’ ఇచ్చిన గర్భిణులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించాలని సూచించారు. విద్యుత్‌ సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే సరిదిద్దడానికి సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. జలాశయాలు, చెరువుల్లో నీటి మట్టాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఆయా సాగునీటి వనరులకు ముప్పు వాటిల్లకుండా అదనపు నీటిని దిగువకు విడుదల చేయాలని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా కట్టడి చేయాలని సూచించారు. ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరం మేరకు వారి సేవలను వినియోగించుకోవాలని వినయ్‌చంద్‌ చెప్పారు. ఈ సమావేశంలో డీఆర్‌ఓ సత్యనారాయణరావు, ఈపీడీసీఎల్‌ ఈఈ ప్రసాద్‌, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 01:20 AM