చూసీచూడనట్టు, పంచాయతీల్లో కనికట్టు!
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:53 AM
ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ పరిధిలో ఓ శీతల గిడ్డంగి విస్తీర్ణం 10 వేల చదరపు అడుగులకు మించి ఉంది.
పన్ను విధింపులో కిరికిరి
వాణిజ్య సముదాయాలు/గోదాములకు పన్ను విధింపులో అక్రమాలు
విస్తీర్ణం మేరకు విధిస్తే భారీగా ఆదాయం
అంతేసి వద్దంటూ కార్యదర్శులపై రాజకీయ ఒత్తిళ్లు
శొంఠ్యాంలో పశుమాంసం పట్టుబడిన శీతల గిడ్డంగి చెల్లిస్తున్నది ఏడాదికి రూ.40 వేలు మాత్రమే
నిబంధనల ప్రకారం చెల్లించాల్సింది రూ.1.5 లక్షలు
నగర శివార్లలో గల నాలుగు మండలాల్లో 10 వేల చ.అ. విస్తీర్ణం పైబడిన సముదాయాలు 70
విశాఖపట్నం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి):
ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ పరిధిలో ఓ శీతల గిడ్డంగి విస్తీర్ణం 10 వేల చదరపు అడుగులకు మించి ఉంది. భూమి విలువ ఆధారంగా ఆ శీతల గిడ్డంగికి ఏడాదికి రూ.1.5 లక్షలకు పైబడి పన్ను విధించాలి. కానీ పంచాయతీ కార్యదర్శిగా గత ఏడాది వరకు పనిచేసిన ఉద్యోగి మాత్రం కేవలం రూ.40 వేలు విధించారు. ఈ లెక్కన గిడ్డంగి నిర్మించినప్పటి నుంచి ఇప్పటివరకూ పన్ను రూపేణా పంచాయతీ రూ.లక్షల్లో ఆదాయం కోల్పోయింది.
నగరానికి ఆనుకుని ఆనందపురం, భీమిలి, పెందుర్తి, పద్మనాభం మండలాల్లో 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న, జీవీఎంసీ సమీపంలోని పంచాయతీల్లో వాణిజ్య సముదాయాలు, గోదాములకు గిరాకీ ఉంది. నాలుగు మండలాల్లో 10 వేల చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న సముదాయాలు సుమారు 70 వరకు ఉన్నాయి. ఐదు వేల నుంచి 10 వేల చ.అ. విస్తీర్ణం ఉన్నవి 150 వరకు ఉంటాయి. వీటి నుంచి పన్ను రూపేణా రూ.కోట్లలో ఆదాయం రావాలి. కానీ పన్నులు ఎక్కువ వేయొద్దని పంచాయతీలపై రాజకీయ నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. కొందరైతే గ్రామ పంచాయతీ కార్యదర్శులను బెదిరిస్తున్నారు. వాణిజ్య సముదాయాల నుంచి నిబంధనల మేరకు పన్నులు వసూలు చేయడంలో కొందరు సర్పంచులు కచ్చితంగా పనిచేస్తుంటే, మరికొందరు వాణిజ్య సముదాయాల యజమానులకు అనుకూలంగా ఉంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా ఆనందపురం మండలం శొంఠ్యాం పంచాయతీ పరిధిలో పశు మాంసం (అందులో కొంత గోమాంసం కూడా ఉందని తేలింది)నిల్వ చేసిన శీతల గిడ్డంగి మధ్య కోస్తా జిల్లాలకు చెందిన కూటమి పార్టీకి చెందిన నాయకుడిదిగా చెబుతున్నారు. ఈ గిడ్డంగి పది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. పంచాయతీ నిబంధనల ప్రకారం గిడ్డంగి యజమాని ఏటా రూ.1.5 లక్షల వరకు పన్ను చెల్లించాలి. కానీ కేవలం రూ.40 వేల మాత్రమే చెల్లిస్తున్నారు. తాజాగా గోమాంసం నిల్వ చేసినట్టు వివాదం చేలరేగడంతో పంచాయతీ కార్యదర్శి అప్రమత్తమై రూ.89 వేలకు పన్ను పెంచారు. గోదాము యజమాని తనకున్న పలుకుబడితో నామమాత్రపు పన్ను చెల్లించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే గిడ్డంగికి రూ.1.5 లక్షల పన్ను వేయాలని శొంఠ్యాం పంచాయతీ కార్యదర్శిని జిల్లా పంచాయతీ అధికారి ఎం.ఎన్.వి.శ్రీనివాసరావు తాజాగా ఆదేశించారు.
ఇదే పంచాయతీలో మరోచోట 10 వేల చ.అ.విస్తీర్ణంలో నిర్మించిన శీతల గిడ్డంగి యజమాని ఇప్పటివరకూ రూ.25 వేలు పన్ను చెల్లిస్తుండగా, ప్రస్తుత ఏడాదిలో రూ.90 వేలకు పెంచారు. ఈ గిడ్డంగి యజమాని వైసీపీ నాయకులకు సన్నిహితంగా ఉండడంతో గతంలో పన్ను నామమాత్రంగా విధించేలా కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చారు. రామవరం పంచాయతీలో శీతల పానీయాలు నిల్వ చేసే గోదాముకు నామమాత్రం పన్ను తప్ప ఎక్కువ వేయొద్దని కూటమి నేత ఒకరు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇలా వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు నడుస్తున్న భవనాలు, కల్యాణ మండపాల నుంచి నిబంధనల మేర పన్నులు రావడం లేదు. దీనివల్ల ఆయా పంచాయతీలు భారీగా ఆదాయం కోల్పోతున్నాయని ఆనందపురం మండలానికి చెందిన సర్పంచ్ ఒకరు వాపోయారు. ఉన్నత స్థాయిలో నాయకులు ఫోన్‌లు చేసి ఒత్తిడి తీసుకురావడం, ఇంకా వినకపోతే బెదిరింపులకు పాల్పడిన సందర్భాలు ఉన్నాయన్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం విషయంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ జోక్యం చేసుకుని ఒక విధానం అమలుచేయాలని కోరారు. కాగా జిల్లాలో వాణిజ్య సముదాయాల నుంచి పన్నుల వసూళ్లపై నిబంధనలు పాటించాలని కార్యదర్శులను ఆదేశించామని జిల్లా పంచాయతీ అధికారి ఎం.ఎన్.వి.శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో వాణిజ్య సముదాయాల నుంచి రూ.1.5 కోట్ల మేరు అధికంగా వచ్చినట్టు చెప్పారు. పది వేల చ.అ. విస్తీర్ణంలో ఉన్న వాటి నుంచి పన్నుల వసూళ్ల విషయంలో నిబంధనలు అమలు చేస్తామని స్పష్టంచేశారు.