అర్జీలపై అలక్ష్యం వద్దు
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:01 PM
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అలక్ష్యంగా వ్యవహరించవద్దని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు.
ఐటీడీఏ పీవో శ్రీపూజ
1100 కాల్‌సెంటర్ సేవలు పొందండి
పీజీఆర్‌ఎస్‌కు 186 వినతులు
పాడేరు, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (మీకోసం)లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై అలక్ష్యంగా వ్యవహరించవద్దని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపాలని ఇన్‌చార్జి జేసీ, ఐటీడీఏ పీవో శ్రీపూజ అన్నారు. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థలో అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై విచారణ చేపట్టి కచ్చితంగా పరిష్కరించాలన్నారు. తమ సమస్యలపై వినతులు సమర్పించే అర్జీదారులు 1100 కాల్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకోవాలని పీవో శ్రీపూజ కోరారు. అర్జీదారులు ఇచ్చిన వినతి స్థితిగతులు, పరిష్కార చర్యలపై పక్కా సమాచారాన్ని తెలుసుకునేందుకు కాల్ సెంటర్ సేవలు పొందాలన్నారు.
186 వినతులు స్వీకరణ
ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో గిరిజనుల నుంచి అధికారులు 186 వినతులను స్వీకరించారు. జాతీయ రహదారి నిర్మాణంలో నిర్వాసితులైన వారికి త్వరగా నష్టపరిహారం చెల్లించాలని, జి.మాడుగుల మండలం కోరాపల్లి పంచాయతీలో సీసీరోడ్లు, కిటుములు నుంచి తోటలగొందికి రోడ్డు నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు వినతిపత్రం సమర్పించారు. హుకుంపేట మండలం భీమవరం పంచాయతీ గుమ్మడిగండుకు రోడ్డు వేయాలని సర్పంచ్ సన్నిబాబు కోరగా, పెదబయలు మండలం కుంతుర్ల పంచాయతీ బొడ్డాపుట్టు గ్రామానికి రోడ్డు, బొంగరం పంచాయతీ వంచుర్భ గ్రామానికి జల్ జీవన్ మిషన్ పనులు చేపట్టాలని ఎం.బాబూజీ కోరారు. అలాగే అనంతగిరి మండలం జీనబాడు పంచాయతీ కేంద్రంలో పదో తరగతి పరీక్షా కేంద్రం మంజూరు చేయాలని స్థానికులు జి.సురేశ్, పి.దేముడు, బి.గంగరాజు కోరారు. అలాగే ముంచంగిపుట్టు మండలం పెదగూడ పంచాయతీ సారధి గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రానికి భవనాన్ని నిర్మించాలని గ్రామస్థులు పి.సత్యారావు, వి.ఆనందరావు, వి.నీలకంఠం, తదితరులు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, డీఆర్‌వో కె.పద్మలత, ఇన్‌చార్జి ఆర్డీవో ఎంవీఎస్.లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళీ, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డీడీ పీబీకే.పరిమిళ, జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్, రోడ్లు, భవనాల శాఖ ఈఈ బాలసుందరబాబు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఈఈ టి.కొండయ్యపడాల్ , గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్.కుమార్, డివిజన్ డెవలప్‌మెంట్ అధికారి ఎ.జయప్రకాశ్, జిల్లా ఖజానాధికారి ప్రసాద్‌బాబు, జాతీయ రహదారుల డిప్యూటీ తహశీల్దార్ వి.ధర్మరాజు, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్.నందు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.