Share News

బల్క్‌ డ్రగ్‌ పార్కు వద్దంటే వద్దు..

ABN , Publish Date - Oct 25 , 2025 | 01:09 AM

మండలంలోని రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్‌డ్రగ్‌ పార్కు అనుమతులను రద్దు చేయాల్సిందేనని మత్స్యకారులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటుచేసిన హెటెరో ఔషధ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ప్రాణాంతక వ్యాధులబారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల కంటే ప్రజల ప్రాణాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

బల్క్‌ డ్రగ్‌ పార్కు వద్దంటే వద్దు..
సభలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

రద్దు చేయాల్సిందేనని మత్స్యకారులు ముక్తకంఠంతో డిమాండ్‌

హెటెరో కాలుష్యంతో ఇప్పటికే ప్రాణాంతక వ్యాధులు ప్రబలుతున్నాయని ఆందోళన

కంపెనీల కంటే తమ ప్రాణాలకే ప్రాధాన్యం ఇవ్వాలని వినతి

సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌

నిపుణులతో అధ్యయనం..100 రోజుల్లో నివేదిక

కలెక్టర్‌ హామీలపై సంతృప్తి చెందని మత్స్యకారులు

నిరసన దీక్షలు కొనసాగించాలని నిర్ణయం

నక్కపల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి):

మండలంలోని రాజయ్యపేట ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన బల్క్‌డ్రగ్‌ పార్కు అనుమతులను రద్దు చేయాల్సిందేనని మత్స్యకారులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఏర్పాటుచేసిన హెటెరో ఔషధ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ప్రాణాంతక వ్యాధులబారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల కంటే ప్రజల ప్రాణాలకే ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.

బల్క్‌ డ్రగ్‌ పార్కు వద్దంటూ రాజయ్యపేట కేంద్రంగా మత్స్యకారులు 41 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 12వ తేదీన మత్స్యకారులు అనూహ్యంగా నక్కపల్లి వరకు ర్యాలీ నిర్వహించి, జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో కలెక్టర్‌ విజయకృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌సిన్హా వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. త్వరలో రాజయ్యపేట వచ్చి, బల్క్‌డ్రగ్‌ పార్కుపై మత్స్యకారులతో మాట్లాడతానని కలెక్టర్‌ చెప్పారు. దీంతో శుక్రవారం కలెక్టర్‌ విజయకృష్ణన్‌ ఇక్కడకు వచ్చారు. సుమారు మూడు గంటలపాటు మత్స్యకారులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. సమీపంలోని హెటెరో ఔషధ కంపెనీ నుంచి వెలువడే కాలుష్యం కారణంగా అనేక మంది క్యాన్సర్‌తోపాటు మూత్రపిండాలు, కాలేయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, ఇంతవరకు 58 మంది ప్రాణాలు కోల్పోయారని మత్స్యకారులు చెప్పారు. గర్భస్రావాలు అధికం అయ్యాయని, సంతానం కలగడం లేదని, సముద్రంలో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లడం వల్ల ఉపాధి కోసం వలస పోతున్నామని మత్స్యకార నాయకులు దైలపల్లి కృష్ణ, మైలపల్లి మహేశ్‌, బైరాగిరాజు, గోసల రాజశేఖర్‌, చొక్కా కాశీ, చేపల సోమేశ్‌, గోసల స్వామి, బొంది బాబ్జీ, పిక్కి తాతీలు, పిక్కి స్వామి తదితరులు ఆవేదన వెలిబుచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లో బల్క్‌డ్రగ్‌ పార్కు ఏర్పాటైతే తమకు మరణశాసనం రాసినట్టేనని చోడిపిల్లి కాశీ, బొంది రాజులమ్మ, పిక్కి పైడితల్లి, పిక్కి కోటి వాపోయారు. బల్క్‌డ్రగ్‌ ఏర్పాటు పనులను వెంటనే ఆపించాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. కాగా కలెక్టర్‌ పర్యటన సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభా వేదిక వద్దకు మత్స్యకారులు ర్యాలీగా వచ్చారు. పోలీసులు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తరువాతే సభా ప్రాంగణంలోకి అనుమతించారు.

Updated Date - Oct 25 , 2025 | 01:09 AM