Share News

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:12 AM

‘మొంథా’ తుఫాన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ సూచించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

ప్రజలకు జిల్లా ప్రత్యేకాధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ సూచన

రాబోయే 38 నుంచి 46 గంటలు అత్యంత కీలకం

విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):

‘మొంథా’ తుఫాన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తుఫాన్‌ 28వ తేదీ అర్ధరాత్రి గానీ, 29వ తేదీ తెల్లవారుజామునగానీ తీరం దాటే అవకాశం ఉందన్నారు. కోస్తాలో 17 నుంచి 19 జిల్లాలు ప్రభావితం కానున్నాయని, వాటిలో తొమ్మిది అత్యంత ప్రభావితం కానున్నాయన్నారు. మొత్తం 87 మండలాలు, 705 గ్రామాలు, 16 అర్బన్‌ ప్రాంతాలు బాగా ప్రభావితం కానున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, కొండవాలు ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల వరకు 1,058 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, 32467 మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. సహాయక చర్యల నిమిత్తం పదకొండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయన్నారు. పదమూడు వేల విద్యుత్‌ స్తంభాలను అందుబాటులో ఉంచామన్నారు. కోస్తా తీరంలోని అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. రాబోయే 38 నుంచి 46 గంటలు అత్యంత కీలకమని, ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


పునరావాస కేంద్రాలకు కొండవాలు ప్రాంతాల వాసులు

జీవీఎంసీ పరిధిలో 74 కేంద్రాలు ఏర్పాటు

చెట్లు, గోడలు వంటివి కూలితే వెంటనే తొలగించేందుకు 20 క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌లు ఏర్పాటు

ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌రూమ్‌లు

జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌

విశాఖపట్నం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి):

మొంథా తుఫాన్‌ నేపథ్యంలో జీవీఎంసీ పరిధిలో ఆస్తి, ప్రాణనష్టం వాటిల్లకుండా కొండవాలు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించినట్టు కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. జీవీఎంసీ పరంగా తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యలను ఆయన సోమవారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి వివరించారు. తుఫాన్‌ ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున కొండవాలు ప్రాంతాల్లో మట్టి, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది కాబట్టి, అక్కడ ఉంటున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని నిర్ణయించామన్నారు. జీవీఎంసీ పరిధిలో 135 ప్రాంతాల్లో 14,431 కుటుంబాలు కొండవాలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నాయని, అందులో ఐదుచోట్ల 249 కుటుంబాలకు ముప్పుపొంచి ఉందని భావిస్తున్నామన్నారు. వారితోపాటు మధ్యస్థ ముప్పు కలిగివున్న ప్రాంతాల్లోని కుటుంబాలను కూడా పునరావాస ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించామన్నారు. కొండవాలుతోపాటు లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నవారు, శిధిలావస్థకు చేరిన భవనాల్లో నివాసం ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు.

భారీవర్షాలు, గాలులకు చెట్లు, గోడలు కూలిపోతే వెంటనే తొలగించేందుకు వీలుగా 20 క్విక్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటుచేశామన్నారు. వర్షం కారణంగా పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోకుండా, గెడ్డలు, డ్రెయిన్లలో ప్రవాహానికి ఇబ్బంది లేకుండా క్లియర్‌ చేసేందుకు 29 జేసీబీలను సిద్ధంగా ఉంచామన్నారు. ముంపు ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో స్ర్పేయింగ్‌ చేసేందుకు 82 యంత్రాలు, 64 ఫాగింగ్‌ మిషన్లు, 15 జనరేటర్లు సిద్ధంగా ఉంచామన్నారు. ఇవికాకుండా రిజర్వాయర్ల వద్ద నీటి సరఫరాకు విద్యుత్‌ అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయంగా 43 డీజిల్‌ జనరేటర్లను అందుబాటులో ఉంచామన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని జోనల్‌ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటుచేసి టోల్‌ ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచామన్నారు. ప్రధాన కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ నుంచి నగరంలో పరిస్థితి, వరదనీటి ప్రవాహనం, సహాయ చర్యలపై పర్యవేక్షిస్తున్నామన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 01:12 AM