Share News

విధి నిర్వహణలో అలక్ష్యం వద్దు

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:33 AM

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ తమర్బ విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. మంగళవారం పెదబయలు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి కిముడుపల్లి సబ్‌ సెంటర్‌లో 104 అంబులెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు.

విధి నిర్వహణలో అలక్ష్యం వద్దు
రూఢకోట పీహెచ్‌సీలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు

- డీఎంహెచ్‌వో విశ్వేశ్వరనాయుడు

- మండలంలోని పీహెచ్‌సీల తనిఖీ

పెదబయలు, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని డీఎంహెచ్‌వో డాక్టర్‌ తమర్బ విశ్వేశ్వరనాయుడు హెచ్చరించారు. మంగళవారం పెదబయలు మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. తొలుత పెదబయలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి కిముడుపల్లి సబ్‌ సెంటర్‌లో 104 అంబులెన్స్‌ ద్వారా నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై డాక్టర్‌ నిఖిల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గోమంగి, రూఢకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. రెండు చోట్లా రికార్డులను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని సూచించారు. ప్రతి నెలా 9వ తేదీన ప్రధానమంత్రి మాతృత్వ అభియాన్‌ కార్యక్రమం నిర్వహించాలన్నారు. నేషనల్‌ డీ వార్మింగ్‌ డే సందర్భంగా ఈ నెల 12న ప్రతి పాఠశాల, ఆంగన్‌వాడీ కేంద్రాల్లో 0 నుంచి 19 ఏళ్ల వయస్సు గలవారికి అల్బెండజోల్‌ మాత్రలు వేయాలని తెలిపారు. ఆశ కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. గోమంగి పీహెచ్‌సీలో రక్షణగోడ లేకపోవడంతో పశువులు, వీధి కుక్కలు ఆస్పత్రిలోకి చొరబడుతుండడంతో ఇబ్బందిగా ఉందని, అలాగే అంబులెన్స్‌ పూర్తిగా మరమ్మతులకు గురైందని ఆయన దృష్టికి సిబ్బంది తీసుకువెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి కలెక్టర్‌ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తానని తెలిపారు. ఆయన వెంట వైద్యులు పి.సత్యారావు, టి.చైతన్య, సంజీవ్‌పాత్రుడు, లక్ష్మణ్‌, సింహాద్రి, తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:33 AM