విరాళాల పుస్తకం అదృశ్యం!
ABN , Publish Date - Sep 06 , 2025 | 01:26 AM
వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి దేవస్థానంలో వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి.
కనకమహాలక్ష్మి ఆలయంలో అంతా అస్తవ్యస్తం
సుమారు వంద రశీదులు కలిగిన బుక్ కనిపించని వైనం
ఎవరు ఏమిచ్చారో తెలియని పరిస్థితి
స్టోర్ రూమ్‌లో లెక్కల్లో చూపని వెండి వస్తువులు
2017 నుంచి జరగని ఆభరణాల మూల్యాంకనం
ఇటీవల విచారణలో బహిర్గతం
దేవదాయ కమిషనర్‌కు నివేదిక
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
వన్‌టౌన్‌లోని కనకమహాలక్ష్మి దేవస్థానంలో వ్యవహారాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. దాతలు ఇచ్చిన విరాళాలకు సంబంధించి రశీదులు ఇచ్చే పుస్తకం ఒకటి అదృశ్యమైపోయింది. అలాగే మూడేళ్లకొకసారి జరగాల్సిన ఆభరణాల మూల్యాంకనం 2017 నుంచి జరగలేదు. ఓ అధికారి ఇటీవల తనిఖీకి వస్తే స్టోర్ రూమ్‌లో లెక్క చూపని ఎనిమిది వెండి ఆభరణాలు లభించాయి. వాటిని ఎవరు ఎక్కడకు తరలించాలనుకున్నారో తెలియదు. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి.
కనకమహాలక్ష్మి దేవస్థానం నుంచి తమకు వెండి, మకర తోరణం తయారీ ఖర్చులు రావాలని, వాటిని ఇప్పించాలని నగరంలో ప్రముఖ జ్యువెలరీ సంస్థ కొద్దికాలం కిందట ఆలయ ఈఓతో పాటు దేవదాయ శాఖ కమిషనర్‌కు లేఖ రాసింది. ఈ అంశాన్ని ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో విజయవాడ అధికారులు అసిస్టెంట్ కమిషనర్ స్థాయి కలిగిన అధికారి పల్లంరాజును మూల్యాంకనం (అప్రైజ్‌మెంట్) కోసం ఇక్కడకు పంపించారు. ఆయన గత నెల ఆలయానికి వచ్చి ఆభరణాలు, ఇతర వివరాలన్నీ లెక్కించారు. ఈ సందర్భంగా పలు అంశాలు వెలుగు చూశాయి.
ఆలయంలో బంగారు, వెండి ఆభరణాలను ప్రతి మూడేళ్లకు ఓసారి తనిఖీ (మూల్యాంకనం) చేయించి రికార్డుల్లో నమోదు చేయించాలి. అదేవిధంగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మారినప్పుడల్లా ఆ లెక్కలు కొత్త ఈఓకు అప్పగించాలి. ఇవేవీ సవ్యంగా జరగడం లేదు. 2017 నుంచి ఇప్పటివరకూ ఆభరణాల మూల్యాంకనం చేయలేదు. దాంతో అప్పటి నుంచి ఆలయ ఈఓలుగా పనిచేసిన వారందరినీ ఆయన విశాఖపట్నం రప్పించారు. జ్యోతి మాధవి, కాళింగరి శాంతి, కె.శిరీష, కె.రమేశ్‌నాయుడు, పి.శ్రీనివాసరెడ్డిలతో పాటు ప్రస్తుత ఈఓ శోభరాణిని కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి లెక్కలు వేశారు. గోల్డ్ బాండ్ స్కీమ్‌కు ఇచ్చిన బంగారు ఆభరణాలు, చర్లపల్లి మింట్‌కు పంపించిన వెండి వస్తువులు, బ్యాంకు లాకర్లలో ఉన్న వస్తువుల లెక్కలన్నీ సరిపోయాయి. అయితే స్టోర్ రూమ్‌లో ఉన్న ఎనిమిది వెండి ఆభరణాల వివరాలు ఎక్కడా కనిపించలేదు. వాటిని ఎవరు ఇచ్చారు?, బరువు ఎంత?...అనేది రాయలేదు. అంటే దాతల నుంచి వస్తువులు తీసుకొని రశీదులు ఇవ్వని సంప్రదాయం ఇంకా ఇప్పటికీ కొనసాగుతున్నదని స్పష్టమైంది. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన వెండి మకర తోరణం వివరాలు ఏ రికార్డులోను కనిపించలేదు. దాని బరువు సుమారు 53 కిలోలు ఉంటుందని అంచనా వేశారు. జ్యోతి మాధవి ఈఓగా ఉన్న సమయంలో దాతలు ఇచ్చినట్టు అర్చకులు తెలిపారు. దాని విలువ రూ.42 లక్షలుగా అంచనా వేశారు. ఇదే విషయమై పాత ఈఓ జ్యోతి మాధవిని వివరణ కోరితే...ఆమె 2021 నవంబరులో ప్రముఖ జ్యువెలరీ సంస్థ 32 కిలోల మకరణ తోరణం ఇచ్చినట్టు రాతపూర్వకంగా రాసి ఇచ్చినట్టు తెలిసింది. అయితే అంతకంటే ఎక్కువ బరువు ఉండడం గమనార్హం.
ఇదిలావుండగా, అధికారి తనిఖీలో రశీదు పుస్తకం 201 నుంచి 300 వరకు సీరియల్ నంబర్లు కలిగింది కనిపించకుండా పోయింది. దాని గురించి ప్రశ్నిస్తే..ఈఓతో సహా ఉద్యోగులంతా అక్కడ..ఇక్కడా వెదికి చేతులెత్తేశారు. అంటే వంద మంది దాతలు ఇచ్చిన విరాళాల లెక్కలు కనిపించకుండా పోయాయి. అవి ఆభరణాలా?, నగదు విరాళాలా?...అనేది తెలియదు. ఈ నివేదికను ఆ అధికారి కమిషనర్ కార్యాలయానికి అందజేసినట్టు తెలిసింది. దీనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో, ఏ విచారణకు ఆదేశిస్తారో వేచిచూడాలి. దేవదాయ శాఖలో అవినీతి శిఖర స్థాయికి చేరితే తప్ప చర్యలు తీసుకున్న సందర్భాలు లేవు. ఇప్పుడు ఏమి చేస్తారో మరి.