గర్భిణికి తప్పని డోలీ మోత
ABN , Publish Date - Sep 23 , 2025 | 11:45 PM
మండలంలోని మారుమూల జామిగూడ పంచాయతీ కేంద్రంలో జామిగూడ- గుంజివాడ గ్రామాల మధ్య గల మత్య్స గెడ్డపై వంతెన లేకపోవడంతో గెడ్డ అవతల ఉన్న గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు.
ఉధృతంగా ప్రవహిస్తున్న మత్స్యగెడ్డ దాటించి అంబులెన్స్ వద్దకు చేర్చిన వైనం
జామిగూడ- గుంజివాడ గ్రామాల మధ్య వంతెన లేక అవస్థలు
పెదబయలు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల జామిగూడ పంచాయతీ కేంద్రంలో జామిగూడ- గుంజివాడ గ్రామాల మధ్య గల మత్య్స గెడ్డపై వంతెన లేకపోవడంతో గెడ్డ అవతల ఉన్న గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. గుంజివాడ గ్రామానికి చెందిన నిండు గర్భిణి అయిన కౌసల్యకు మంగళవారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. కౌసల్యను డోలీలో గెడ్డ దాటించడానికి కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ప్లాస్టిక్ కుర్చీని వెదురు కర్రలకు కట్టి డోలీలా తయారు చేసి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటుకుంటూ అతికష్టం మీద అంబులెన్స్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించగా వైద్యుల పర్యవేక్షణలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. మత్స్యగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు డోలీ మోతలు తప్పడం లేదని గుంజివాడ, చింతలవీధి, తారాబు, జడిగూడ, గబ్బర్ల, సరిగిగూడ గ్రామాలకు చెందిన గిరిజనులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయంలో 2.95 కోట్లతో ప్రారంభమైన వంతెన నిర్మాణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసి తమ కష్టాలు తీర్చాలని వారు కోరుతున్నారు.