Share News

గర్భిణికి తప్పని డోలీ మోత

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:27 PM

మండలంలోని మారుమూల పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆస్పత్రికి డోలీలో తరలించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది.

గర్భిణికి తప్పని డోలీ మోత
గర్భిణిని డోలీలో గెడ్డ దాటిస్తున్న కుటుంబ సభ్యులు

చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం అవస్థలు

ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ దాటి ఆస్పత్రికి తరలింపు

అనంతగిరి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మారుమూల పెదకోట పంచాయతీ చింతలపాలెం గ్రామానికి రహదారి సౌకర్యం లేక నిండు గర్భిణిని ఆస్పత్రికి డోలీలో తరలించిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. చింతలపాలెం గ్రామానికి చెందిన కొర్రా జానకి నిండు గర్భిణి. ఆమెకు బుధవారం పురిటినొప్పులు అధికమయ్యాయి. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వాహనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను డోలీలో ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. చింతలపాలెం నుంచి సుమారు కిలోమీటరు మేర డోలీపై తీసుకువచ్చారు. బూసిపుట్టు సమీపంలోకి వచ్చేసరికి పూర్తిగా దారిలేకపోవడం, వర్షాలకు కొండవాలును ఆనుకుని వరద నీరు ప్రవహించడంతో సుమారు కిలోమీటరు మేర నిండు గర్భిణిని నడిపించాల్సి వచ్చింది. అక్కడ నుంచి కొండిభకోట వరకు నాలుగు కిలోమీటర్లు డోలీలో మోసుకువచ్చి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను అతి కష్టం మీద దాటించారు. అక్కడ నుంచి కొంతదూరం మోసుకు వచ్చి రేగుళ్లపాలెం మెయిన్‌రోడ్డు నుంచి ఫీడర్‌ అంబులెన్స్‌ ద్వారా ఆమెను ఆస్పత్రికి తరలించారు. రహదారి లేక అష్టకష్టాలు పడుతున్నామని, ఇప్పటికైనా రహదారి సౌకర్యం కల్పించాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Aug 13 , 2025 | 11:27 PM