Share News

గర్భిణికి తప్పని డోలీ మోత

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:56 AM

: మండలంలోని అర్ల పంచాయతీ శివారు కొండ శిఖర గ్రామమైన కొత్త లోసింగికి రహదారి సౌకర్యం లేక రోగులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఇదే విధంగా ఆదివారం ఉదయం ఓ గర్భిణిని నాలుగు కిలోమీటర్ల మేర డోలీలో తరలించాల్సి వచ్చింది. అంబులెన్స్‌ రావడం ఆలస్యం కావడంతో మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది.

గర్భిణికి తప్పని డోలీ మోత
కొత్త లోసింగి నుంచి డోలీపై గర్భిణిని తీసుకువస్తున్న దృశ్యం

- నాలుగు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సిన దుస్థితి

- మార్గమధ్యంలో ప్రసవం

- కొత్త లోసింగికి రహదారి సౌకర్యం లేక ఇక్కట్లు

రోలుగుంట, జూలై 13(ఆంధ్రజ్యోతి): మండలంలోని అర్ల పంచాయతీ శివారు కొండ శిఖర గ్రామమైన కొత్త లోసింగికి రహదారి సౌకర్యం లేక రోగులకు డోలీ మోతలు తప్పడం లేదు. ఇదే విధంగా ఆదివారం ఉదయం ఓ గర్భిణిని నాలుగు కిలోమీటర్ల మేర డోలీలో తరలించాల్సి వచ్చింది. అంబులెన్స్‌ రావడం ఆలస్యం కావడంతో మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది.

రోలుగుంట మండలం అర్ల పంచాయతీ శివారు కొండ శిఖర గ్రామమైన లోసింగిలో పీవీటీజీ తెగకు చెందిన 70 కుటుంబాలకు చెందిన 290 మంది జనాభా నివసిస్తున్నారు. కొత్త లోసింగికి చెందిన పాంగి సాయి(22) అనే గర్భిణికి రెండవ కాన్పులో భాగంగా ఆదివారం ఉదయం నొప్పులు రావడంతో భర్త సుందరరావు కుటుంబ సభ్యుల సహాయంతో నాలుగు కిలోమీటర్లు డోలీ కట్టించుకుని వైబీపట్నం వరకు తీసుకువచ్చారు. అంబులెన్సు ఆలస్యంగా రావడంతో అక్కడే పాంగి సాయికి మర్రి చెట్టు వద్ద ప్రసవం అయ్యి పాపకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్సు రావడంతో అక్కడి నుంచి బుచ్చెంపేట పీహెచ్‌సీకి తరలించి వైద్యం అందిస్తున్నారు. దీంతో తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు.

మధ్యలో నిలిచిన రహదారి నిర్మాణం

డోలీ మోతలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైబీపట్నం నుంచి లోసింగి వయా పెదగరువు గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2.5 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో కాంట్రాక్టర్‌ నాలుగు నెలల క్రితం పనులు ప్రారంభించారు. అయితే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్‌ మధ్యలోనే పనులు నిలిపివేశారు. అప్పటి వరకు చేసిన పనుల్లో ఇటీవల కురిసిన వర్షాలకు సైడ్‌ కాలువలు కొట్టుకుపోయాయి. రోడ్డు కూడా అక్కడక్కడ కొట్టుకుపోయింది. దీంతో వాహనాలు వెళ్లే అవకాశం లేకుండాపోయింది. రోగులు, గర్భిణులు అత్యవసరమైతే డోలీలో రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే రోడ్డు పనులను పూర్తి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:56 AM