Share News

ఈతలో డాక్టరమ్మ రాణింపు

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:19 PM

పాడేరు మండలంలోని మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్‌ సాయిశ్రీ ఈత పోటీల్లో రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. తన నాలుగో ఏట నుంచే ఈత నేర్చుకుని పోటీల్లో పాల్గొంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మొత్తం 112 పతకాలు సాధించానని ఆమె తెలిపారు.

ఈతలో డాక్టరమ్మ రాణింపు
డాక్టర్‌ సాయిశ్రీని అభినందిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ (ఫైల్‌)

జాతీయ స్థాయి ఈత పోటీల్లో మినుములూరు పీహెచ్‌సీ డాక్టర్‌ సాయిశ్రీ సత్తా

నాలుగో ఏట నుంచే ఈతపై ఆసక్తి

20 ఏళ్లలో 112 పతకాలు కైవసం

అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేందుకు సమాయత్తం

(పాడేరు- ఆంధ్రజ్యోతి)

పాడేరు మండలంలోని మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పని చేస్తున్న డాక్టర్‌ సాయిశ్రీ ఈత పోటీల్లో రాణిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు. తన నాలుగో ఏట నుంచే ఈత నేర్చుకుని పోటీల్లో పాల్గొంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో మొత్తం 112 పతకాలు సాధించానని ఆమె తెలిపారు. ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లో జరిగిన ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ అధికారుల 2024- 25 ఈత పోటీల్లోనూ ఆమె ప్రతిభ చూపి రెండు కాంస్య పతకాలు సాధించారు. ఈతపై ఆమెకున్న ఆసక్తి, చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, రాణింపు, భవిష్యత్తు లక్ష్యాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

స్వస్థలం విజయవాడ...

మాస్వస్థలం విజయవాడ. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న మధుసూదనరావు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, తల్లి ధనలక్ష్మి గృహిణి, చెల్లెలు సాయిప్రియ రెవెన్యూ శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నది.

ఆరేళ్లకే కృష్ణా నదిలో ఈత

2004లో నా వయస్సు కేవలం ఆరేళ్లు. అప్పట్లోనే కృష్ణా నదిలో ఈదాను. నాలుగో ఏట నుంచే ఈతపై ఆసక్తితో పట్టుసాధించి ఆరేళ్ల వయస్సు వచ్చే సరికి కృష్ణానదిలో ఈతుకుంటూ ఇవతల నుంచి అవతల ఒడ్డుకు చేరుకున్నాను. ఎంబీబీఎస్‌ మినహా చదువంతా విజయవాడలోనే సాగింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కెనడి స్కూల్‌లో, ఆరు నుంచి పదో తరగతి వరకు గాంఽధీ హైస్కూల్లో, ఇంటర్‌ శ్రీచైతన్యలో పూర్తి చేసి ఎంబీబీఎస్‌ గాయత్రి విద్యాపరిషత్‌ అండ్‌ మెడికల్‌ సైన్సు విశాఖపట్నంలో పూర్తి చేశాను. 2024లో మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పోస్టింగ్‌లో చేరాను. డాక్టర్‌గా సేవలందించడం, మరో వైపు స్విమ్మింగ్‌ క్రీడాకారిణిగా నా ఆసక్తి నెరవేర్చుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టంగా అనిపించినా రెండిటికీ న్యాయం చేసేందుకే మొగ్గు చూపుతున్నాను.

20 సంవత్సరాల్లో 112 పతకాలు

గత 20 ఏళ్లుగా ఈత పోటీల్లో పాల్గొని 112 వరకు పతకాలు సాధించాను. 2004లో రాష్ట్ర స్థాయి 50 మీటర్ల విభాగం ఈత పోటీల్లో తొలిసారి బంగారు పతకాన్ని సాధించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరెడ్డి చేతుల మీదుగా పతకాన్ని అందుకున్నాను. అలాగే 2006లో గోవాలో జరిగిన జాతీయ స్థాయి ఈత పోటీల్లో బంగారు పతకాన్ని పొందాను. అప్పటి నుంచి మొదలు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 5 బంగారు పతకాలు, రాష్ట్ర స్థాయిలో 72 బంగారు, 24 వెండి, 11 క్యాంస పతకాలను సాధించాను. ఈ ఏడాది మార్చిలో గుజరాత్‌లో జరిగిన ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ 2024- 25 ఈత పోటీల్లోనూ 50, 100 మీటర్ల విభాగాల్లోనూ రెండు కాంస్య పతకాలు సాధించాను. వైద్యురాలిగా పని చేస్తూ ఈత పోటీల్లో రాణించినందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌, వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, శ్యాప్‌ ఎండీ గిరిశా, కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌, తదితరులు అభినందనలు తెలపడం జీవితంలో మర్చిపోలేని అనుభూతి. తల్లిదండ్రుల సహకారంతో ఈత పోటీల్లో రాణిస్తున్న నన్ను ప్రభుత్వం మరింత ప్రోత్సహిస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రానికి మరింత ఖ్యాతి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నాను. అందుకు అందరూ అశీర్వదించాలని కోరుకుంటున్నాను.

Updated Date - Aug 05 , 2025 | 11:19 PM