వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి
ABN , Publish Date - Sep 02 , 2025 | 01:16 AM
వైద్యులు, వైద్య విద్యార్థులు గ్రామీణ, గిరిజన ప్రాంతాలతో అనుసంధానమై పనిచేయాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
బదిలీల సమయంలో చాలామంది ఫోన్ చేస్తున్నారు
వ్యక్తిగత కారణాలు చెప్పి ట్రాన్స్‌ఫర్ నిలపాలని కోరుతున్నారు
ఆ తరహా సిఫారసులు నేను చేయను
క్యాన్సర్‌ను నియంత్రించేందుకు నడుంబిగించిన ప్రభుత్వం
చికిత్స కంటే ముందుగా గుర్తించడమే కీలకమన్న విధానంతో ముందుకు వెళుతున్నాం
క్యాన్సర్ వల్ల ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయా
అందుకే ఆ మహమ్మారిపై పోరాటం
వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్
కేజీహెచ్‌లో అత్యాధునిక చికిత్సా పరికరాలు ప్రారంభం
విశాఖపట్నం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి):
వైద్యులు, వైద్య విద్యార్థులు గ్రామీణ, గిరిజన ప్రాంతాలతో అనుసంధానమై పనిచేయాలని వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కేజీహెచ్‌లోని కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ సెంటర్‌లో ఏర్పాటుచేసిన అత్యాధునిక పరికరాలను సోమవారం ఉదయం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర మెడికల్ కళాశాల ఆవరణలోని సెంటినరీ అకడమిక్ బ్లాక్‌లో వైద్యులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బదిలీల సమయంలో ఎంతోమంది వైద్యులు తనకు ఫోన్లు చేస్తున్నారని, వ్యక్తిగత కారణాలు చెప్పి బదిలీలు నిలపాలని కోరుతున్నారన్నారు. ఆ తరహా సిఫార్సులు తాను చేయబోనన్నారు. వైద్యులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ వ్యాధిని నిర్మూలించేందుకు నడుంబిగించిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు రాకుండా జాగ్రత్తపడడంపై అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. క్యాన్సర్ వ్యాధిని సకాలంలో గుర్తించేందుకు సర్వే చేపడుతున్నామని, కొందరు మహిళలు ముందుకురాకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. సర్వే కోసం వేలాది మంది వైద్య సిబ్బందిని వినియోగిస్తున్నట్టు వెల్లడించారు. చికిత్స కంటే ముందుగా గుర్తించడమే కీలకమన్న విధానంతో ముందుకు వెళుతున్నామన్నారు.
క్యాన్సర్ వల్ల తాను కుటుంబంలో ముగ్గురిని కోల్పోయానని మంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. అమ్మ, సోదరుడు, అక్క క్యాన్సర్‌తో మరణించినట్టు తెలిపారు. ఆ ఘటనలు తనను ఎంతగానో కలచివేశాయని, అందుకే క్యాన్సర్ మహమ్మారిపై ప్రజాప్రతినిధిగా పోరాటం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ రంగంలో నిష్ణాతులను తయారుచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళుతున్నామన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గత కొన్నాళ్లుగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అత్యాధునిక పరికాలు అందించడం గొప్ప విషయమన్నారు. మరోఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కేజీహెచ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, రెండుసార్లు గుండెపోటు వస్తే ప్రాణాలు నిలిపిందన్నారు. కార్యక్రమంలో ఎన్‌టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సంధ్యాదేవి, కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి, అడ్మినిస్ర్టేటర్ బీవీ రమణ, సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ శ్రీహరి, ఆర్‌ఎంవో డాక్టర్ బంగారయ్య, అంకాలజీ విభాగం వైద్యాధికారులు డాక్టర్ ఎం.శ్రీనివాస్, డాక్టర్ శిల్ప, డాక్టర్ పాండురంగకుమారి, డాక్టర్ చంద్రశేఖరం నాయుడు, డాక్టర్ గిరినాథ్‌తోపాటు అధిక సంఖ్యలో వైద్యులు పాల్గొన్నారు.