మాతాశిశు మరణాలకు వైద్యులే బాధ్యులు
ABN , Publish Date - May 27 , 2025 | 10:57 PM
జిల్లాలో మాతాశిశు మరణాలు సంభవిస్తే అందుకు వైద్యులు బాధ్యత వహించాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్
ప్రతి చిన్నారికి విధిగా ఆధార్ నమోదు చేయాలని సూచన
పాడేరు, మే 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాతాశిశు మరణాలు సంభవిస్తే అందుకు వైద్యులు బాధ్యత వహించాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ అన్నారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మాతాశిశు మరణాలు చోటుచేసుకోకుండా అవసరమైన జాగ్రత్తలు చేపట్టాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, పారామెడికల్ సిబ్బందిపై మరింత పర్యవేక్షణ పెంచాలన్నారు. పీహెచ్‌సీల పరిధిలో చోటుచేసుకుంటున్న మాతాశిశు మరణాలు సక్రమంగా నమోదుకాకుంటే వైద్య ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు చేపడతామన్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ప్రభుత్వ సహాయాన్ని పొంది ఆర్థికంగా ఎదగాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రపంచ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని, అధిక సంఖ్యలో ప్రజలు యోగా కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. జిల్లాలో 28 వేల మంది చిన్నారులకు ఆధార్ లేదని, ప్రతీ చిన్నారికి ఆధార్ నమోదు చేయాలన్నారు. జిల్లాలో 8,895 మంది చిన్నారులకు జనన ధ్రువీకరణ పత్రాలు లేవని, వారందరికీ ఆలస్య జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డుల నమోదు చేయాలని సూచించారు. విద్యుత్ లేని అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సదుపాయం కల్పించాలని, అంగన్‌వాడీ కేంద్రాలు కేవలం ఫీడింగ్ సెంటర్లుగా కాకుండా కనీస అక్షరాభ్యాసం చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పీవోలు ఎంజే అభిషేక్‌గౌడ, కట్టా సింహాచలం, అపూర్వ భరత్, గ్రామ సచివాలయాల నోడల్ అధికారి పీఎస్ కుమార్, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, డ్వామా పీడీ విద్యాసాగరరావు, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి బి.లవరాజు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎల్.రజని, జిల్లా నైపుణాభివృద్ధి అధికారి రోహిణి, తదితరులు పాల్గొన్నారు.