నేడు డాక్‌యార్డ్ వంతెన ప్రారంభం
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:22 AM
పారిశ్రామిక ప్రాంతవాసుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. వంతెన నిర్మాణం నిమిత్తం సుమారు 15 నెలల పాటు మూసివేసిన మార్గం తెరచుకోనుంది. బుధవారం ఉదయం నుంచి వంతెనపై రాకపోకలకు పోర్టు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. భారీ వాహనాలు మినహా, మిగిలిన అన్నిరకాల వాహనాలను అనుమతించనున్నారు.
అందుబాటులోకి సర్దార్ వల్లభాయ్ పటేల్ బ్రిడ్జి
రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన పోర్టు అధికారులు
మల్కాపురం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):
పారిశ్రామిక ప్రాంతవాసుల ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. వంతెన నిర్మాణం నిమిత్తం సుమారు 15 నెలల పాటు మూసివేసిన మార్గం తెరచుకోనుంది. బుధవారం ఉదయం నుంచి వంతెనపై రాకపోకలకు పోర్టు అధికారులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. భారీ వాహనాలు మినహా, మిగిలిన అన్నిరకాల వాహనాలను అనుమతించనున్నారు.
పునర్నిర్మాణం నిమిత్తం 2024 ఆగస్టు 1 నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెనను మూసివేశారు. తొమ్మిది నెలల్లో వంతెన నిర్మాణం పూర్తిచేయాల్సి ఉండగా, వివిధ కారణాలతో ఆలస్యమయింది. రూ.30 కోట్ల వ్యయంతో గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మిషనరీ ప్రాజెక్ట్స్ సంస్థ దీనిని నిర్మించింది. ఈ నెల 10, 11 తేదీలలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నిపుణులు వంతెనపై లోడింగ్ పరీక్షలు చేసి, ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో పోర్టు అధికారులు బుధవారం వంతెన ప్రారంభిస్తామని అధికారికంగా ప్రకటించారు.
వంతెన పొడవు 330 మీటర్లు, వెడల్పు 10.5 మీటర్లు. దిగువన సముద్రం ఉన్నందున ఉప్పుగాలులకు వంతెన నిర్మాణంలో ఉపయోగించిన ఇనుము తుప్పుపట్టకుండా విదేశాల నుంచి తీసుకువచ్చిన పెయింట్లను వేశారు. ఎలకో్ట్ర మాగ్నిటెక్ బేరింగులను కూడా ఏర్పాటుచేశారు. పాదచారులు నడిచి వెళ్లేందుకు ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌ను నిర్మించారు. దీనికిందనే విద్యుత్ కేబుల్స్‌ను రన్ చేయడానికి ట్రాక్‌లను నిర్మించారు. కాగా రాత్రి సమయంలో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వంతెనపై 15 విద్యుత్ దీపాలను అమర్చారు.
ప్రయాణం ఇలా..
పారిశ్రామిక ప్రాంతవాసులు నేరుగా వంతెన పైనుంచి ఎస్‌ఆర్ కంపెనీ మీదుగా కాన్వెంట్ వంతెనకు చేరుకుని, అక్కడి నుంచి నగరంలోకి వెళ్లవచ్చు, తిరిగి వచ్చేటప్పుడు జ్ఞానాపురం దాటిన తరువాత రామ్మూర్తిపంతులు పేట మీదుగా డాక్‌యార్డు క్వార్టర్స్ మార్గంలో వంతెనపైకి వచ్చి, అక్కడి నుంచి పారిశ్రామిక ప్రాంతానికి చేరుకోవచ్చు. వంతెన అందుబాటులోకి రానుండడంతో ప్రయాణాలకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరం తగ్గనుంది.