Share News

లెక్క తేల్చండి!

ABN , Publish Date - Sep 15 , 2025 | 01:21 AM

సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు వినియోగించే ఇసుకపై ఆడిట్‌కు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం, రాజమండ్రి నుంచి సరఫరా చేసిన ఇసుకలో ఇప్పటివరకు ఎంత వినియోగించారు? ఇంకా లేఅవుట్‌లలో ఎంత నిల్వ ఉందనేది తేల్చేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

లెక్క తేల్చండి!

ఇళ్ల నిర్మాణాల ఇసుకపై ఆడిట్‌

అధికారులను ఆదేశించిన కలెక్టర్‌

లేఅవుట్‌లలో అక్రమాలపై ఫిర్యాదులు

యథేచ్ఛగా అమ్ముకుంటున్నారనే ఆరోపణలు

విశాఖపట్నం, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి)

సెంటు స్థలంలో ఇళ్ల నిర్మాణాలకు వినియోగించే ఇసుకపై ఆడిట్‌కు జిల్లా యంత్రాంగం రంగం సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం, రాజమండ్రి నుంచి సరఫరా చేసిన ఇసుకలో ఇప్పటివరకు ఎంత వినియోగించారు? ఇంకా లేఅవుట్‌లలో ఎంత నిల్వ ఉందనేది తేల్చేందుకు జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. హౌసింగ్‌ అధికారుల సిఫారసుతో అవసరాలకు మించి ఇసుక తెప్పించారు. ఇదే సమయంలో లేఅవుట్‌ల నుంచి దారి మల్లించారనే ఫిర్యాదులున్నాయి. సరఫరా, వినియోగం మధ్య భారీ తేడా ఉందనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఇసుక వినియోగంపై లెక్కలు తేల్చాలని హౌసింగ్‌/ గనులశాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

నగర శివారు ప్రాంతాల్లోని 65 లేఅవుట్‌లలో సెంటు స్థలాల్లో సుమారు లక్ష ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించి మూడేళ్లు కావస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 టన్నుల ఇసుక ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు అన్ని లేఅవుట్‌లలో సుమారు 80వేల ఇళ్ల పనులు ప్రారంభించగా వాటిలో 25 వేల నిర్మాణాలు పూర్తిచేయగా మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి. శ్రీకాకుళం, రాజమండ్రి రీచ్‌ల నుంచి ప్రతిరోజూ పదుల లారీలతో ఇసుక సరఫరా జరుగుతోంది. వంశధార, నాగావళి, గోదావరి నదుల్లో గుర్తించిన రీచ్‌ల నుంచి ఇసుక తరలింపునకు గనుల శాఖ ఎప్పటికప్పుడు పర్మిట్లు జారీచేస్తుంటుంది. దీని ప్రకారం ఇంత వరకు 2.25 లక్షల టన్నుల ఇసుక సరఫరా జరిగింది. దీంట్లో 1.75 లక్షల టన్నుల ఇసుకను వినియోగించగా మిగిలింది ఆయా లేఅవుట్‌లలో ఉన్నట్టు అధికారులు నివేదికల్లో చూపిస్తున్నారు.

ఆది నుంచీ ఆరోపణలు

ఇసుక వినియోగంపై మొదటి నుంచి అనేక ఆరోపణలున్నాయి. లే అవుట్‌లకు వచ్చిన ఇసుకను హౌసింగ్‌లో కిందిస్థాయి సిబ్బంది, కాంట్రాక్టరుకు చెందిన మనుషులు, ఇసుక రవాణా చేసే డ్రైవర్ల మధ్య అనధికార ఒప్పందం ఉందనే ఫిర్యాదులున్నాయి. లేఅవుట్‌ల నుంచి సమీప గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు ఇసుక విక్రయిస్తున్నారు. సమీపంలోని లేఅవుట్‌ నుంచి టన్ను రూ.400కు ఆనందపురం మండలం గండిగుండం, రామవరం, భీమన్నదొరపాలెం గ్రామాలకు చెందిన పలువురు కొనుగోలుచేశారు. దీంతో పాటు ఇనుము, సిమెంట్‌ కొనుగోలుచేయడం బహిరంగ రహస్యం. ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, సబ్బవరం మండలాల్లో లేఅవుట్‌ల నుంచి సమీప గ్రామాలకు ఇసుక పబ్లిక్‌గా తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇంకా ప్రతి ఇంటికీ 20 టన్నుల ఇసుక వినియోగించాల్సి ఉన్నా అంత కంటే తక్కువగా వాడుతున్నారు. రూ.1.8 లక్షలతో చేపట్టిన ఇంటి నిర్మాణాలకు, రూ.2.15 లక్షలతో నిర్మించే ఇళ్లకు మధ్య ఇసుక వినియోగంలో తేడా ఉంది. అయినా రెండింటికి ఒకే విధంగా ఇసుక అవసరమని అధికారులు గనులశాఖకు ఇన్‌వాయిస్‌లు జనరేట్‌ చేస్తున్నారు. కొందరు ఏఈల చేతివాటం హౌసింగ్‌ సంస్థకు తలనొప్పిగా మారింది. ఇదిలా వుండగా ఉమ్మడి జిల్లాలో నదుల నుంచి తవ్విన ఇసుకను రాజమండ్రి నుంచి తెస్తున్నామని ఒక ట్రాన్స్‌పోర్టర్‌ తప్పుడు రవాణా బిల్లులు పెట్టారనే ఆరోపణలున్నాయి. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్‌, ఇసుక సరఫరా, వినియోగంపై పూర్తిస్థాయిలో లెక్కలు తేల్చడానికి వీలుగా ఆడిట్‌ చేయాలని ఆదేశించారు. త్వరలో గనులుశాఖ, హౌసింగ్‌ సంస్థ సంయుక్తంగా ఇసుక వినియోగంపై లెక్కలు తేల్చనున్నాయి.

Updated Date - Sep 15 , 2025 | 01:21 AM