Share News

సహనాన్ని పరీక్షించొద్దు

ABN , Publish Date - Sep 09 , 2025 | 01:19 AM

ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ హెచ్చరించారు.

సహనాన్ని పరీక్షించొద్దు

  • అర్జీల పరిష్కారం విషయంలో అధికారులు పద్ధతి మార్చుకోవాలి

  • లేనిపక్షంలో చర్యలు తప్పవు

  • కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ ఆగ్రహం

  • జీవీఎంసీ, పోలీస్‌ శాఖలకు

  • వస్తున్న ఫిర్యాదులకు నాణ్యమైన

  • పరిష్కారం లభించడం లేదని అసంతృప్తి

  • టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది నిర్లక్ష్యం వీడకుంటే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరిక

విశాఖపట్నం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి):

ప్రజా సమస్యల పట్ల స్పందించే తీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తప్పవని అధికారులను కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిరప్రసాద్‌ హెచ్చరించారు. సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో తొలుత గత వారం వచ్చిన అర్జీలపై తీసుకున్న చర్యల గురించి సమీక్షించారు. అర్జీలకు నాణ్యమైన పరిష్కారం లేకపోవడంపై కలెక్టర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఆయా సమస్యలపై ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చి ఇచ్చే అర్జీలకు పరిష్కారం చూపకుండా సంబంధిత అధికారులకు ఎండార్స్‌మెంట్‌ ఇవ్వడమేమిటంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలన్నారు. జీవీఎంసీ, పోలీస్‌ శాఖలపై వస్తున్న ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం లభించడం లేదని నివేదికలు చూస్తే అర్థమవుతుందన్నారు. జీవీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది అర్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెండ్‌ చేస్తానని హెచ్చరించారు. గతంలో అందిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. ప్రజల పట్ల అధికారులు, సిబ్బంది వ్యవహరించే తీరు మెరుగుపడాలని సూచించారు. అందిన ఫిర్యాదును పరిష్కరించే క్రమంలో అర్జీదారుడితో సంబంధిత అధికారులు ఫోన్‌లో మాట్లాడాలని, సమస్యను సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని హితవు పలికారు. తన సహనాన్ని పరీక్షించవద్దని అంటూ కలెక్టర్‌ గట్టిగా హెచ్చరించారు. కాగా సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 315 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూకు సంబంధించి 119, జీవీఎంసీ...85, పోలీస్‌ శాఖకు సంబంధించి 21 ఉండగా, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి. అర్జీల స్వీకరణ కార్యక్రమంలో జేసీ కెమయూర్‌ అశోక్‌, డీఆర్వో బీహెచ్‌ భవానీశంకర్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2025 | 01:19 AM