Share News

గీత దాటొద్దు

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:14 AM

నూతన సంవత్సరం వేడుక పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి పోలీస్‌ శాఖ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి సోమవారం ఒక ప్రకటన ద్వారా స్పష్టంచేశారు.

గీత దాటొద్దు

న్యూ ఇయర్‌ వేడుకలకు అనుమతి తప్పనిసరి

కపుల్స్‌ కోసం నిర్వహించే కార్యక్రమాలు, పబ్‌లలోకి మైనర్లను అనుమతించరాదు

కార్యక్రమాన్ని అర్ధరాత్రి ఒంటి గంటకు ముగించాలి

31న రాత్రి నగరవ్యాప్తంగా తనిఖీలు

మద్యం సేవించి వాహనం నడిపితే జైలు, జరిమానా

పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చి

విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):

నూతన సంవత్సరం వేడుక పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడానికి పోలీస్‌ శాఖ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి సోమవారం ఒక ప్రకటన ద్వారా స్పష్టంచేశారు. వేడుకలు నిర్వహించాలనుకునే హోటళ్లు, క్లబ్‌లు, అసోసియేషన్లు, ఈవెంట్‌ మేనేజర్లు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏపీ పబ్లిక్‌ సేఫ్టీ (మెజర్స్‌) ఎన్‌ఫోర్స్‌మెంట్‌ యాక్ట్‌ 2013 ప్రకారం నిర్వాహకులు ప్రతీ ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద, పార్కింగ్‌ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నారు. అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటిస్తున్నారని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతి జారీచేయడం జరుగుతుందన్నారు. కపుల్స్‌ కోసం నిర్వహించే కార్యక్రమాలు, పబ్‌లలోకి మైనర్లను అనుమతించరాదన్నారు. స్విమ్మింగ్‌పూల్స్‌ వద్దకు ఎవరినీ అనుమతించకుండా ప్రత్యేక గస్తీ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. అర్ధనగ్న ప్రదర్శనలు, అశ్లీలతకు తావులేకుండా కార్యక్రమాలు జరుపుకోవాలన్నారు. డీజే స్పీకర్ల శబ్దం కూడా 45 డిసిబెల్స్‌కి మించకూడదని స్పష్టంచేశారు. బాణాసంచా కాలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్సైజ్‌ శాఖ అనుమతించిన సమయం వరకే మద్యం అనుమతించాలని, అగ్నిమాపక శాఖ అధికారుల సలహాలు పాటించాలని సూచించారు. వాటన్నింటినీ కస్టమర్లకు తెలిసేలా వేడుక జరిగే ప్రాంతంలో బోర్డులు ఏర్పాటుచేయాలని సీపీ సూచించారు. కార్యక్రమాన్ని అర్ధరాత్రి ఒంటి గంటకు ముగించాలని సీపీ స్పష్టంచేశారు. ఒకవేళ ఎవరైనా అనుమతి లేకుండా వేడుకలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 31వ తేదీ ప్రతి జంక్షన్‌ వద్ద పోలీసుల గస్తీ, పికెట్‌ ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కేసులు నమోదు చేస్తామని, రూ.పది వేల వరకూ జరిమానా, ఆరు నెలలు వరకూ జైలు శిక్షపడే అవకాశం ఉంటుందన్నారు. 31న నగరంలో పోలీసులు, ఈగల్‌ టీమ్‌లు కలిసి గస్తీ తిరుగుతాయని, ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌ వాడితే ఈగల్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972కి లేదంటే 7995095799 నంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇవ్వాలని నగరవాసులను కోరారు.

Updated Date - Dec 30 , 2025 | 01:14 AM