డీఎంహెచ్‌వో మినుములూరు పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:35 PM
మండలంలో మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయిక్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సక్రమంగా విధులు నిర్వహించని ముగ్గురు ఉద్యోగులకు షోకాజ్
రోగులకు వైద్య సేవలపై ఆరా
పీహెచ్‌సీ ఆవరణ తీరుపై అసంతృప్తి
పాడేరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలో మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్ డి.కృష్ణమూర్తి నాయిక్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని సిబ్బందితో మాట్లాడి, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న రోగులు, వారికి అందిస్తున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉద్యోగుల హాజరును పరిశీలించి, సకాలంలో విధులకు హాజరుకాని ఇద్దరు హెల్త్ సూపర్‌వైజర్లకు, ఒక స్టాఫ్‌నర్స్‌కు షోకాజ్ నోటీసులను జారీ చేశారు. అలాగే మలేరియాకు సంబంఽధించి రక్తపూతల వివరాల రికార్డులను సక్రమంగా నిర్వహించని ల్యాబ్ టెక్నీషియన్‌ను మందలించారు. పీహెచ్‌సీలోని అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆశించిన స్థాయి పీహెచ్‌సీ ఆవరణ బాగాలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. అలాగే కాలం చెల్లిన మందులను ప్రత్యేక ప్రదేశంలో మాత్రమే ఖననం చేయాలని, పాము, కుక్కకాటు వ్యాక్సిన్‌లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. విధుల పట్ల అంకితభావంతో పని చేయాలని సిబ్బందికి డీఎంహెచ్‌వో సూచించారు.