Share News

వ్యాపారులకు దీపావళి ధమాకా!

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:07 AM

దీపావళి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి.

వ్యాపారులకు దీపావళి ధమాకా!

  • జోరందుకున్న బాణసంచా విక్రయాలు

  • గత ఏడాదితో పోలిస్తే పెరిగిన అమ్మకాలు

  • వర్షాలు లేకపోవడంతో ఫుల్‌ జోష్‌

  • ధరలు పెరిగినా కనిపించని ప్రభావం

విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):

దీపావళి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా విక్ర యాలు జోరుగా సాగుతున్నాయి. నగర పరిధిలోని ఏయూ, ఆల్వార్‌దాస్‌ మైదానాలతోపాటు మధురవాడ, ఎన్‌ఏడీ, గాజువాక ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్టాల్స్‌ ఏర్పాటు చేసి విక్రయాలు సాగిస్తున్నారు.

జిల్లాలో మొత్తం 530 మందికి అధికారులు బాణసంచా విక్రయాలకు లైసెన్సులు మంజూరుచేశారు. కొన్నిచోట్ల వీఽధుల్లో ప్రత్యేక స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. గత ఏడాదితో పోలిస్తే 20 నుంచి 30 శాతం అమ్మకాలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది దీపావళికి ముం దు వర్షాలు కురవడంతో అమ్మకాలపై ప్రభావం పడింది. ఈ ఏడాది వర్షం లేకపోవడం వ్యాపారులకు కలిసి వచ్చింది. సోమవారం కూడా వర్షం లేకపోతే స్టాక్‌ క్లియర్‌ చేసేస్తామని చెబుతున్నారు. ఇక ధరలు ఐదు నుంచి పది శాతం పెరిగాయి. అయితే అమ్మకాలపై పెద్దగా ప్రభావం పడలేదంటున్నారు.

ప్రత్యేక ఆఫర్లు

నగర పరిధిలో బాణసంచా విక్రయిస్తున్న వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. 40, 50, 60 శాతం తగ్గింపు అంటూ ఆకట్టుకునే ప్రయ త్నం చేస్తున్నారు. ఇదే అదనుగా గత ఏడాది నిల్వలను క్లియర్‌ చేసుకుంటున్నారు. దీంతో వినియోగదారులు ఎగబడుతున్నారు.

నేడు కీలకం..

ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో ఆదివారం అమ్మ కాలు భారీగానే సాగాయి. ఇక దీపావళి సందర్భంగా సోమవారంపై వ్యాపారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. శని, ఆదివారాల్లో 40 నుంచి 50 శాతం అమ్మకాలు సాగాయి. వర్షం లేకపోతే మంచి వ్యాపారం జరుగుతుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ ప్యాక్‌, స్పెషల్‌ ప్యాక్‌లను ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ప్యాక్‌లో 20 నుంచి 50 వరకు ఐటెమ్స్‌ ఉంటున్నాయి. స్పెషల్‌ బాక్సు ధర రూ.800 నుంచి రూ.5 వేలు వరకు ఉన్నాయి.

అమ్మకాలు బాగున్నాయి

మూడేళ్లతో పోలిస్తే అమ్మకాలు పెరిగాయి. సోమవారం కూడా వర్షం పడకపోతే 100 శాతం అమ్మకాలు సాగే వీలుంది. ధరలు అందుబాటులో ఉండడంతో ప్రజలు భారీగా వస్తున్నారు. ఆదివారం జిల్లాలో పెద్దఎత్తున విక్రయాలు సాగాయి. చోడవరం, తుని, తణుకు, విజయనగరం నుంచి సరకు తీసుకువచ్చి విక్రయిస్తున్నాం.

- కె.రాజశేఖర్‌, వైజాగ్‌ ఫైర్‌ వర్కర్స్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌

షాపుల వద్ద భారీ రద్దీ

రెండు, మూడేళ్లతో పోలిస్తే భారీ సంఖ్యలో కొనుగోలు దారులు వచ్చారు. ప్రతి షాపు కిక్కిరిసిపోయింది. గత ఏడాది రూ.3 వేలు సామగ్రి కొన్నాం. ఈ ఏడాది రూ.2500కే ఎక్కువ వచ్చాయి. ధరలు భారీగా పెరిగినట్టు అనిపించలేదు. అవసరమైన మేరకు తీసుకున్నాం.

- కె.వరలక్ష్మి, మధురవాడ


అనుమతుల్లేకుండానే విక్రయాలు

వ్యాపారులకు పోలీసుల మద్దతు

అగ్నిమాపకశాఖ అధికారులదీ అదే తీరు

ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత?

విశాఖపట్నం, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):

నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండానే బాణసంచా విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటా దీపావళికి నాలుగైదు రోజులు ముందుగానే బాణసంచా దుకాణాలను ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతులు జారీచేస్తుంటారు. ఈ ఏడాది పండగ ముందురోజు వరకు అనుమతులు జారీచేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనుమతులు లేకపోయినా కొందరు ఏయూ ఇంజనీరింగ్‌మైదానం, ఎంవీపీకాలనీలోని ఏఎస్‌రాజా మైదానం, గాజువాక ప్రాంతాల్లో దుకాణాలను ఏర్పాటుచేసేశారు. నిబంధనలు పాటించాలని సీపీ శంఖబ్రతబాగ్చి వారంరోజుల ముందే మార్గదర్శకాలు జారీచేసినా పట్టించుకోలేదు. దుకాణాల మధ్య దూరం, ఇసుక బకెట్లు, నీటిడ్రమ్ములు, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేయలేదు. దీనిని సీపీ సీరియస్‌గా తీసుకుని వాటిని తొలగించేందుకు సన్నద్దమయ్యారు. ఇంతలో ఏమైందో దుకాణాలను తొలగించేందుకు వెళ్లినపోలీసులు ట్రాఫిక్‌ ఇబ్బందుల్లేకుండా వ్యాపారులకు సూచనలిచ్చి వెళ్లిపోయారు. ఏయూ మైదానంలోని దుకాణాలను తనిఖీ చేసేందుకు బయలుదేరిన సీపీ ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాటికి కూడా దుకాణాలకు పోలీస్‌, అగ్నిమాపకశాఖ నుంచి అనుమతులు లేనిప్పటికీ విక్రయాలు సాగుతున్నాయి. కొందరు పోలీసు సిబ్బందే వ్యాపారుల వెనుకుండి విక్రయాలకు భరోసా ఇచ్చారని, అగ్నిమాపక శాఖ అధికారులు కూడా వంత పాడారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Updated Date - Oct 20 , 2025 | 12:07 AM