పంచాయతీల విభజన
ABN , Publish Date - Nov 29 , 2025 | 01:22 AM
గ్రామ పంచాయతీల పునర్విభనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఉత్తర్వులు విడుదల
జిల్లాలో మూడు నుంచి నాలుగు వరకూ విభజన?
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
గ్రామ పంచాయతీల పునర్విభనకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయా పంచాయతీల ప్రజల కోర్కె మేరకు ప్రతిపాదనలు రూపొందించి పంపాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతుల మేరకు వైసీపీ ప్రభుత్వం గత పంచాయతీ ఎన్నికల ముందు ఉమ్మడి జిల్లాలో కొన్ని పంచాయతీలను విభజించి కొత్తవి ఏర్పాటుచేసింది. వచ్చే ఏడాది మార్చితో ప్రస్తుత పంచాయతీ పాలకవర్గాల గడువు ముగియనున్నది. అనంతరం ఎన్నికలకు కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అంతకంటే ముందుగా పంచాయతీల విభజన చేయాలని నిర్ణయించింది. పంచాయతీ కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలతో పాటు ఎక్కువ జనాభా ఉన్నచోట పాలనా సౌలభ్యం కోసం కొత్త పంచాయతీలు ఏర్పాటుచేయాలనే డిమాండ్ ఉంది. విశాఖ జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 79 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల పంచాయతీలకు గ్రేడింగ్ ప్రతిపాదించిన నేపథ్యంలో కొత్తగా నాలుగైదు కొత్త పంచాయతీల ఏర్పాటుకు అవకాశాలున్నాయని చెబుతున్నారు. నగరానికి ఆనుకుని కొన్ని పంచాయతీలు ఆస్తి పన్ను రూపేణా ఏడాదికి రూ.కోటికి మించి ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. నగర విస్తరణ, ఐటీ కంపెనీల రాక, తదితర పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కొన్నిచోట్ల పంచాయతీల విభజనకు నేతలు పట్టుబడుతున్నారు. ప్రజా ప్రతినిధుల ద్వారా కొత్త పంచాయతీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కొత్త పంచాయతీల ఏర్పాటుచేసే సమయంలో సంబంధిత పంచాయతీ పరిధిలో గ్రామ సభ నిర్వహించి ప్రజల అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా జీవో కూడా విడుదల కావడంతో జిల్లాలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు.
రేషన్ డిపోల్లో రాగులు పంపిణీ
విశాఖపట్నం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
రేషన్ డిపోల్లో డిసెంబరు ఒకటో తేదీ నుంచి బియ్యం కార్డుదారులకు ఉచితంగా మూడుకిలోల రాగులు (మూడు కిలలో బియ్యానికి బదులు) పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ప్రజలకు పోషకాహారం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. కార్డుదారులకు సంబంధించి ప్రతి యూనిట్‌కు ఐదు కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తారని, అయితే బియ్యానికి బదులు ప్రతి కార్డుపై మూడు కిలోల రాగులు అందజేసేలా డిపోల్లో ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వినియోగదారులు డిపోలకు వెళ్లినప్పుడు బియ్యం బదులు రాగులు తీసుకోవాలన్నారు.
చంద్రంపాలెంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం
మధురవాడ, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి):
చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం నిర్మించే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ఇంజనీరింగ్ అధికారులు శుక్రవారం శ్రీకారం చుట్టారు. పిల్లర్లు వేయడానికి జేసీబీలతో గోతులు తవ్వించి, మట్టి నమూనాలు సేకరించారు. తొలుత మట్టి నమూనాలను పరీక్షించనున్నట్టు అధికారులు వెల్లడించారు. పరీక్షల్లో వచ్చిన నివేదిక ఆధారంగా పనులను ప్రారంభించనున్నారు. వంతెన నిర్మాణానికి జీవీఎంసీ రూ.3.43 కోట్లు మంజూరుచేసిన విషయం తెలిసిందే.